బాబు బినావిూల్లో..  మొదటి వ్యక్తి రమేష్‌

– సారా దుకాణం నుంచి వేల కోట్లు రమేష్‌కెలా వచ్చాయి
– బాబు బినావిూలపై లోతుగా విచారణ జరపాలి
– వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్‌ రెడ్డి, సురేష్‌ బాబు
కడప,అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ) : రాష్ట్రంలో ఏమి జరిగినా టీడీపీ నాయకులు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. కడప పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సురేష్‌ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డిలు పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినావిూలలో మొదటి వాడు సీఎం రమేశ్‌ అని ఆరోపించారు. సారా దుకాణం నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తికి సీఎం రమేశ్‌ ఎలా వచ్చాడని ప్రశ్నించారు. అనేక మందిని మోసం చేసిన, కడుపుకొట్టి అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. 2014 ముందు ఏడాదికి రూ.50 కోట్ల కాంట్రాక్టు పనులు చేసే రుత్విక్‌ కంపెనీ నేడు రూ.3500 కోట్లకు ఎలా వచ్చిందని సూటిగా అడిగారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. ఉక్కు పరిశ్రమ అడిగితే ఐటీదాడులు అని చెప్పడం శోచనీయమన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఉక్కుపరిశ్రమ గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక వీటి అన్నింటిపైన విచారణ చేస్తామని చెప్పారు. చంద్రబాబు బినావిూలపై లోతుగా విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందని అన్నారు. నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు అండ్‌ కో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. రాజధాని పేరుతో ఒకవైపు, ఇసుక, మట్టి, ప్రాజెక్టుల నిర్మాణం, జన్మభూమి కమిటీలు ఇలా దేనిలో చూసినా టీడీపీ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మరోవైపు తాను కేంద్రం పై పోరాటం చేస్తున్నానని, తనకు ప్రతిపక్షాలు కలిసి రావటం లేదంటున్న చంద్రబాబు.. మొన్నటి వరకు బీజేపీతో రాసుకుపూసుకుంది ఎవరిని ప్రశ్నించారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని, అవసరాన్ని బట్టి మాటలు మార్చుతూ.. ప్రజలను పిచ్చోళ్లుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని  వైసీపీ నేతలు అన్నారు.

తాజావార్తలు