‘బాబ్రి’ కూల్చివేతలో … పీవీ పరోక్ష హస్తం
ఆ సమయంలో పీవీ పూజల్లో నిమగ్నమయ్యాడు
కూల్చి వేత పూర్తయ్యాకే మసీదు కూల్చారని తెలిసాకే పూజవిరమించాడు
ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ ఆత్మకథలో సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి):
మాజీ ప్రధాని పివి నర్సింహారావుపై మరో విమర్శ వచ్చింది. కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేస్తున్న సమయంలో అప్పటి ప్రధాని పివి నర్సింహారావు పూజలో కూర్చున్నారని, కూల్చివేత పూర్తయిన తర్వాతనే పూజ నుంచి లేచారని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ ఆరోపించారు. రోలీ బుక్స్ ప్రచురిస్తున్న తన ఆత్మకథ ‘బియాండ్ లైన్స్’లో ఆయన ఈ ఆరోపణ చేశారు. ఈ పుస్తకం తర్వలో విడుదల కాబోతోంది. బాబ్రీ మసీదు కూల్చివేతకు పివి నర్సింహారావు సహకరించారని చెప్పడానికే ి ఆయన ఈ ఆరోపణ చేశారనే వాదన వినిపిస్తోంది. కుల్దీప్ నయ్యర్ ఆత్మకథలో పివి నర్సింహారావు ప్రభుత్వం అనే అధ్యాయం ఉంది. పూజలో కూర్చున్న పివి నర్సింహారావు చెవిలో ఆయన సహాయకుడు మసీదును కూల్చారని ఊదాడని, ఆ తర్వాత క్షణాల్లోనే పివి పూజ ముగించారని మధు లిమాయే (సోషలిస్టు నాయకుడు) తనతో చెప్పారని ఆ అధ్యాయంలో కుల్దీప్ నయ్యర్ రాశారు. కుల్దీప్ నయ్యర్ ఆరోపణను పివి నర్సింహారావు కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పివి రంగారావు ఖండించారు. ఆ మాటలు నమ్మశక్యంగా లేవని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పివి ఆగ్రహం చెందారని, ఏళ్ల తరబడి ముస్లింలను పివి ప్రేమించారని, అది జరిగి ఉండాల్సింది కాదని తమతో చాలా సార్లు అన్నారని ఆయన వివరించారు. కుల్దీప్ నయ్యర్ వంటి ప్రముఖ జర్నలిస్టు స్వార్థ ప్రయోజనాల కోసం తన తండ్రిపై విషం చిమ్మడం సరి కాదని ఆయన అన్నారు. బాబ్రీ కూల్చివేత తర్వాత అల్లర్లు చెలరేగినప్పుడు పివి నర్సింహారావు కొంత మంది జర్నలిస్టులను తన నివాసానికి ఆహ్వానించారని కుల్దీప్ నయ్యర్ రాశారు. కూల్చివేతను అపడానికి తాము చేసిన ఏర్పాట్లను వివరించడానికి బాధపడ్డారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తనను మోసం చేశాడని పివి చెప్పారని ఆయన రాశారు. కాంగ్రెస్ పార్టీలో మసీదు కూల్చివేత వల్ల లుకలుకలు ప్రారంభం కాలేదని, అంతర్గత వైరుధ్యాల వల్లనే లుకలుకలు పుట్టాయని, పివి నర్సింహారావును సోనియా గాంధీ ఎప్పుడూ ఇష్టపడలేదని నయ్యర్ రాశారు.