బాలా త్రిపుర సుందరిగా కనకదుర్మమ్మ
ఇంద్రకీలాద్రిపై రెండోరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడ,అక్టోబర్11(జనంసాక్షి): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల భాగగంఆ శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లలితా త్రిపుర సుందరిదేవి రూపంలో అమ్మవారు 3 సంవత్సరాల బాలికా రూపంలో కనిపిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా అనుకున్న పనులు నెరవేరతాయని భక్తుల నమ్మకం.
ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు. తొలిరోజు 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొదటి రోజుతో పోలిస్తే ఈరోజు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దసరా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కేరళ నుంచి తెప్పించిన కళాకారుల డప్పు వాయిద్యాలు దుర్గమ్మ ఆలయంలో ప్రతిధ్వనిస్తున్నాయి. అమ్మవారి భక్తుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. వేకువ జాముననే భక్తులు కృష్ణా నదిలో స్నానమాచరించి అమ్మవారి కోసం వస్తున్నారు. అమ్మ తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చింది. భక్తుల సకల దారిద్యాల్రను తొలగించి.. ఐశ్వర్యాన్ని ప్రసాదించే రూపంలో దుర్గమ్మ దేదీప్యమానంగా వెలుగులీనుతూ.. భక్తులను ఆశీర్వదించింది. స్వర్ణకవచాలంకృత అమ్మవారిని దర్శించుకుంటే.. శుభదాయకం, ఆనందదాయకం, ఐశ్వర్యదాయకమని భక్తుల భావన. అందుకే జగన్మాత దర్శనానికి తండోపతండాలుగా భక్తజనం తరలివచ్చింది. నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవమూర్తులను అలంకరించిన పల్లకీలో ఉంచి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నగరోత్సవం నిర్వహించారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ నగరోత్సవాన్ని ప్రారంభించారు. మల్లేశ్వరాలయ ప్రధానార్చకుడు మల్లేశ్వరశాస్త్రి, స్థానాచార్య శివప్రసాదశర్మ పాల్గొన్నారు. గురువారం బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరించారు.