బిజెపిలో కొరవడిన వాజ్‌పేయ్‌,అద్వానీల స్ఫూర్తి

ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగిన మోడీ
వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసిన పాలన
న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): మోడీ అధికారం చేపట్టాక బిజెపిలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. పార్టీ పెద్దలను గౌరవించి తీసుకునే నిర్ణయాలపై అంతర్గతంగా చర్చించాలన్న స్పహ లేకపోవ డంతో బిజెపి ప్రజల్లో పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. వాజ్‌పేయ్‌,అద్వానీల స్ఫూర్తిని కొనసాగించడంలో ప్రధాని మోడీ పూర్తిగా విఫలమయ్యారు. ఏకధృవ కేంద్రంగా బిజెపిని నడపడంతో అది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చదన్న భావన ప్రజల్లో బలపడిపోయింది. గడిచిన ఐదేళ్లుగా దేశంలో విభజన రాజకీయాలు, కక్షసాధింపు చర్యలతో రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. పారదర్శకత, జవాబుదారీతనంతో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అత్యున్నత సంస్థలు సిబిఐ, ఈడి, ఐటీ న్యాయవ్యవస్థలను కేంద్రం తన చెప్పుచేతల్లోకి తీసుకుని తన జేబు సంస్థలుగా మార్చుకోవడంతో ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. తనకు అనుకూలం కాని రాష్ట్రాలపై గతంలో కాంగ్రెస్‌ 356 అధికరణం ప్రయోగించి ఆయా రాష్ట్రాలను రద్దు చేస్తూ వచ్చేది. బిజెపి అలా చేయకున్నా మోడీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా మరో రకంగా అదే ప్రయోగాన్ని ఉపయోగించారు. సిబిఐ లాంటి అత్యున్నత సంస్థల గౌరవాన్ని గంగలో కలిపారు. వారిలో వారే
కలహించుకుని బహిరంగంగా కేసులు పెట్టుకుని, సంస్థ పరువును నడిబజారులో నిలబెట్టే స్థాయికి దిగజార్చారు. అలాగే అత్యున్నత న్యాయవ్యవస్థలో రాజకీయాల జోక్యాన్ని నిరసిస్తూ న్యాయాధీశులు రోడ్డెక్కి విూడియా సమావేశంలో మొరపెట్టుకోవాల్సిన దుస్థితికి దిగజార్చారు. తత్ఫలితంగా చట్టం, న్యాయం విూద ప్రజలకు గౌరవం పోయేలా ప్రవర్తించారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపు ధోరణులతో నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అనేక సందర్భాల్లో తన మాటే నెగ్గేలా చేసింది. గడిచిన నాలుగున్నరేళ్లకు పైగా మోదీ పాలనను గమనిస్తే బిజెపి పాలిత రాష్ట్రాలు , ఆ పార్టీకి మద్దతు తెలియజేస్తున్న వారిపై ఎంత పెద్దకేసులున్నా రక్షిస్తూ, బీజేపీయేతర నేతలపై పాత కేసులు తిరగదోడి వేధింపులకు పాల్పడుతుండడం ద్వారా మోడీ విశ్వస నీయతను ప్రశ్నించేలా చేశాయి. యూపీఏ హయాంలో ఓ ఎమ్మెల్యే వేసిన కేసుతో అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ సిబిఐ వైయస్‌ జగన్‌ లాంటి వారిని స్వతంత్రంగా విచారించగలిగింది. నేడు అదే సిబిఐ స్వేచ్ఛ కోల్పోయి మోదీ చేతిలో కీలుబొమ్మలా మారింది.  జగన్‌ విషయంలో మాత్రం కేసులు పక్కదారి పట్టాయి. జగన్‌ పై జరిగిన కోడికత్తి కేసును పనిగట్టుకుని ఎన్‌ఐఏకు బదలాయించడం ఏ మేరకు సబబో అర్థంచేసుకోవాలి. తనకు కంటి విూద కునుకు లేకుండా చేస్తున్న మమతాబెనర్జీని పశ్చిమబెంగాల్‌లో ఇరుకున పెట్టింది.శారదా కుంభకోణం కేసులో ముద్దాయిలుగా ఉన్న ముకుల్‌ రాయ్‌ అకస్మాత్తుగా బీజేపీలో చేరగానే ఆయనపై ఉన్న కేసులను తొక్కిపెట్టారు. అలాగే కర్ణాటకలో గాలి జనార్దన్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలపై ఉన్న అక్రమ మైనింగ్‌, అవినీతి కేసులను పట్టించుకోలేదు. మోదీ, అమిత్‌ షాల చాణక్యం కారణంగా దేశంలో పాలన సంగతెలా ఉన్నా బిజెపి అంటే ప్రజల్లో విశ్వాసం పోయేలా చేసింది. బహుజన సమాజ్‌ వాది పార్టీ అధినేత్రి మాయావతిపై 11 ఏళ్ల కిందట నమోదయిన కేసును దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత తిరగతోడి ఈడీ దాడులు నిర్వహించడం, ఆమె హయాంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరిని అరెస్ట్‌ చేయించడం మోదీ విశ్వసనీయతకు అద్దం పడుతోంది. అలాగే తనను తీవ్రంగా విమర్శించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరించి, అధికారాలను తగ్గించేందుకు లెప్టినెంట్‌ గవర్నర్‌ను ఉపయోగించుకున్నారు. కేరళ సీయం పినరయ్‌ విజయన్‌ను సిబిఐ ప్రశ్నించేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరడం కక్షసాధింపు తప్ప మరోటి కాదు. తమిళనాడులో డిఎంకే నేతలు కనిమొళి. ఏ రాజాలు 2017లో నిర్దోషులంటూ తీర్పు వచ్చినా మళ్లీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసారు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వెయ్యాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా తమిళనాడు, కర్నాటకల్లో అనుసరిస్తున్న విధానాలు జుగుప్సాకరంగా తయారయ్యాయి. మనీలాండరింగ్‌ కేసులు,  ఈడీ దాడులు,  సిబిఐ ఎంక్వైరీలు చేయించడం, తదే/రిళితగ రదటగోపోబ అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించడం, విచారణకు ఆదేశించడం వంటి చర్యల వెనుక ప్రత్యర్థి పార్టీలను అణగదొక్కే కుట్ర దాగుంది. అమిత్‌ షా కొడుకు జైషాపై అవినీతి ఆరోపణలు, షిర్డీ ఇండస్ట్రీస్‌  కోట్లాది రూపాయల స్కాం చేసిన పీయూష్‌ గోయెల్‌పై వచ్చిన ఆరోపణలపై నోరు మెదపలేదు. మధ్యప్రదేశ్‌ వ్యాపం కుంభకోణం, షాబుద్దీన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌లో తనపై అమిత్‌ షా పై వచ్చిన ఆరోపణలు, గుజరాత్‌ అల్లర్ల కేసును పక్కదోవ పట్టించి దేశంలో తాము మాత్రమే నీతిపరులమని మిగతా వారంతా అవినీతిపరులన్నట్లు మోదీ పదేపదే ప్రకటించుకున్నారు. ఇదే విషయాన్ని అయన పదేపదే చెబుతూ ఇప్పుడు మళ్లీ బిజెపికే ఓటేయండని అడుగుతున్నారు. బిజెపిలో కూడా ఇప్పుడు మోడీ తీరుపై చర్చ మొదలయ్యింది. గడ్కరీ లాంటి నేతలు బహిరంగంగానే విమర్శలకు పదను పెట్టారు. మోడీ నాయకత్వానికి రానున్నది పరీక్షా కాలమనడంలో సందేహం లేదు.