బిజెపి పాలిత రాష్ట్రాల్లో మళ్లీ విజయం

వ్యతిరేక వాదనల్లో పసలేదన్న అమిత్‌షా

తెలంగాణలో అంతర్గత ఒప్పందాలేవీ లేవని స్పష్టీకరణ

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బిజెపి పాలిత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, ఆయా రాష్టాల్లో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలో రాలేదని వస్తున్న వాదనలతో తాను ఏకీభవించబోనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. మూడు రాష్టాల్లో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తుంది. డిసెంబరు 11న వెలువడే ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అతి శక్తిమంతమైన, ప్రజలకు చేరువైన నేతగా రుజువు చేస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి ఆయనే మళ్లీ ప్రధాని అవుతారు’ అని వ్యాఖ్యానించారు.ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే శాసనసభ ఎన్నికలు ముగియగా, మధ్యప్రదేశ్‌లో బుధవారం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత, ప్రతికూలత అనే రెండు అంశాలూ ఉంటాయి. అయితే, దురదృష్టవశాత్తూ విూడియా ఈ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతపైనే దృష్టి పెట్టింది. భాజపా ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధి పనులు, సుపరిపాలనే అజెండాగా ప్రచారం చేస్తూ, మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని అన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తున్నారు. తిరిగి భాజపానే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఆ మూడు రాష్టాల్లో మేము 129 ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశాం. కొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రభావం దేశంలోని ఓటర్లపై ఉంటుందన్నారు. 2014కి ముందు రెండు సార్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ పదేళ్ల కాలంలో ఆ రాష్ట్ర అభివృద్ధి నెమ్మదిగా జరిగింది. కానీ, 2014లో కేంద్రంలోనూ మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో మధ్యప్రదేశ్‌ మరింత వేగంగా అభివృద్ధి జరిగిందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం భాజపా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణాతో పాటు చాలా రాష్టాల్లో విజయకేతనం ఎగురవేసింది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ప్రభావం పరస్పరం.. ఒకదానిపై ఒకటి పడుతోందని అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై మేము నిబద్ధతతో ఉన్నామన్నారు. ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌,బిజెపిల మధ్య స్నేహపూర్వక పోటీ లేదని స్పష్టం చేశారు. కాగా, కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విషయంలో ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ్‌ బెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని ఆయన అన్నారు.