బీమా పథకాలపై అవగాహన పెంచాలి
అనంతపురం,అక్టోబర్20(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బీమా పథకాల వినియోగంపై విస్తృత ప్రచారం చేపట్టి ఖాతాదారుల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని వివిధ బ్యాంకర్లు పేర్కొన్నారు. అటల్ పింఛన్ యోజన, జీవనజ్యోతి బీమా యోజన, జీవన సురక్ష యోజన.. వంటి వాటిని ప్రతి ఖాతాదారుడు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పీఎంజేడీవై పథకం కింద ఉన్న లబ్ధిదారులకు ప్రమాద బీమా రూ.లక్ష వస్తుందనీ.. ఇది ఎంతో ప్రయోజనం కలిగిన పథకం అన్నారు. అధికారులు, బ్యాంకర్లు ఈ పథకాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలు చేకూరే బీమా పథకాలను తెచ్చిందన్నారు. మొబైల్ బ్యాంకింగ్, ఈ-పాస్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను కూడా ప్రవేశ పెట్టామన్నారు. ఈ అంశాలపై ఖాతాదారుల్లో ప్రచారం చేయాల్సి ఉందన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు చేయూతనిస్తున్నామన్నారు. బ్యాంక్ పరిధిలో ఉన్న సహకార సంఘాల ద్వారా రైతుకు వ్యవసాయ రుణాలు పంపిణీ చేశామన్నారు. అర్హులైన ప్రతి రైతు పంటరుణం పొందవచ్చన్నారు. రుణాలు పొందిన రైతులు సకాలంలో చెల్లించి, మరో రైతుకు రుణం అందించడానికి సహకరించాలన్నారు. బకాయిలున్న రైతులకు నాబార్డునుంచి రాయితీ వర్తిస్తుందన్నారు. ఖాతాలు ప్రారంభించిన వారికి ఎటిఎం కార్డులు కూడా పంపిణీ చేస్తామన్నారు.