బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ

– నాలుగున్నరేళ్లుగా బీసీలకు అన్యాయం చేశారు
– అంతప్రేముంటే.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా?
– త్వరలో బీసీల కోసం కార్యాచరణ ప్రకటిస్తాం
– వైఎస్‌ జగన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుంది
–  వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద్‌రావు
విజయవాడ, జనవరి28(జ‌నంసాక్షి) : బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమని, మాయమాటలతో బీసీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబు మాటలు నమ్మి మోస పోవడడానికి బీసీలు సిద్ధంగా లేరన్నారు. ఐదేళ్ల కాలంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
జయ¬ బీసీ అనే అధికారం చంద్రబాబుకు లేదన్నారు. బీసీలకు ఉపయోగపడే ఒక్క సంక్షేమ పథకమైనా పెట్టారా అని ప్రశ్నించారు. బీసీలు ప్రశ్నిస్తారనే భయంతో చంద్రబాబు జయ¬ బీసీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. బీసీలకు మేలు చేస్తే ఇలాంటి సభలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏ వర్గాలకు చెందిన వారిని కేంద్ర మంత్రులుగా పంపారో అందరికి తెలుసన్నారు. టీడీపీ నుంచి ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా అని చంద్రబాబును ధర్మాన ప్రశ్నించారు. బీసీలకు జరిగిన అన్యాయాలపై జస్టిస్‌ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారని నిలదీశారు. బీసీలు జడ్జిలుగా పనికిరారు అని కేంద్రానికి లేఖ రాసిన విషయం నిజంకాదా అని ప్రశ్నించారు. మత్క్యకారులను ఎస్టీల్లో కలుపుతామని ఓట్లు వేయించుకొని..
నిరసన చేస్తే అంతు చూస్తానన్న మాటలను ప్రజలు మర్చిపోలేదన్నారు. కులం పేరుతో నాయీ బ్రాహ్మణులను దూషించిన విషయం మర్చిపోయారా అని చంద్రబాబును ప్రశ్నించారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన అని ఆరోపించారు. బీసీలకు ఏం చేయలేదు కాబట్టే ఇప్పుడు అది చేస్తాం..ఇది చేస్తామని కపట ప్రేమ నటిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు సీఎంగా ఉండడం వల్లే సమసమాజం రావడం లేదన్నారు. బీసీలను దివంగత సీఎం వైఎస్‌ ఎంతో ప్రేమగా చూసుకున్నారని, వారికోసం దేశంలో ఎక్కడ లేని విధంగా ఫిజు రియింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైఎస్‌ వల్లే బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు పొందారని చెప్పారు. అతి త్వరలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ బీసీల కోసం కార్యాచరణ ప్రకటిస్తారని వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.