‘బీసీ గర్జన’ సభ నిర్వహణకు వైసీపీ నిర్ణయం!


– బీసీ నేతలతో సమావేశమైన జగన్‌
– బీసీల అభ్యున్నతికి ప్రకటించబోయే హావిూలపై చర్చ
– ఫిబ్రవరి19న బీసీ గర్జన సభ
– బీసీలు లక్ష్యంగా కీలక పథకాలు ప్రకటించే ఛాన్స్‌
హైదరాబాద్‌, జనవరి28(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ అధికార టీడీపీ ఆదివారం రాజమండ్రిలో జయ¬ బీసీ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బీసీలకు సీఎం చంద్రబాబు పలు వరాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌ సోమవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో బీసీ నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్‌, పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని తదితర బీసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యనేతలతో చర్చించిన జగన్‌.. బీసీ గర్జన సభ నిర్వహిద్దామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 19న ఈ సభను నిర్వహింద్దామని, తద్వారా బీసీలు వైసీపీ వెంటే ఉన్నారని నిరూపింద్దామని అన్నారు. ఇప్పటికే వైసీపీ నియమించిన బీసీ అధ్యయన కమిటీ గత ఆరు నెలలుగా రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో, కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా సమావేశంలో పలు నిర్ణయాలపై బీసీనేతలతో జగన్‌ చర్చించారు. ఈ సందర్భంగా నేతలుసైతం పలు సూచనలు చేయడంతో వాటితో పాటు కమిటీ సూచనలతో బీసీలకు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా మేలు చేయాలో ఒక ప్రణాళిక రూపొందిద్దామని నిర్ణయించారు. కాగా ఫిబ్రవరి 19న జరిగే బీసీ గర్జన వేదికగా బీసీలకు వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పనులను, హావిూలను ప్రకటించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరి 19న వైసీపీ బీసీ గర్జన – జంగా కృష్ణమూర్తి
వైసీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న ఆంధప్రదేశ్‌లో బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్‌,  బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఆంధప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల స్థితిగతులను, జీవన ప్రమాణాలను తెలుసుకునే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏడాదిన్నర క్రితం బీసీ అధ్యయన కమిటీ నియమించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధ్యయన సమావేశాలు నిర్వహించామని, అధ్యయన కమిటీ ద్వారా అనేక అంశాలతో కూడిన నివేదికను సోమవారం వైఎస్‌ జగన్‌కు అందజేశామని పేర్కొన్నారు. వాటి గురించి వైఎస్‌ జగన్‌ పూర్తి స్థాయిలో సవిూక్షించారని తెలిపారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు.. వాటినే మళ్లీ కొత్తగా చెబుతున్నారని కృష్ణమూర్తి మండిపడ్డారు. 2014 మ్యానిఫెస్టోలో పెట్టిన హావిూలను టీడీపీ ఏమేరకు
అమలు చేసిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బీసీలను అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రలోభ పెట్టి, వారి ఓట్లు వేయించుకుని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని.. ఈ విషయాన్ని స్వయంగా జస్టిస్‌ ఈశ్వరయ్య చెప్పారని పేర్కొన్నారు. బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేసిన చంద్రబాబుకు జయ¬ బీసీ అనే అర్హత లేదని విమర్శించారు. తమ అధ్యయనంలో భాగంగా సంచార జాతులను కూడా కలిశామని.. కొంత మంది బీసీలకు తమ కులం ఏమిటో కూడా స్పష్టంగా తెలియదనడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం? చేసుకోవచ్చన్నారు. కోట్లు కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప బీసీల పట్ల చంద్రబాబుకు ప్రేమ లేదని వైసీపీ నేత కొలుసు పార్థసారథి విమర్శించారు. మెడికల్‌ సీట్ల విషయంలో బీసీలు నష్టపోతున్నా టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు.  ఫీజు రియంబర్స్‌మెంట్‌పై ఒక్కమాట కూడా మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రతి కాబినెట్‌ విూటింగ్‌లో భూములు, ఇసుక గురించి చర్చించారు.. ఒక్క బీసీకైనా ఎకరా భూమి కేటాయించారా అని ప్రశ్నించారు. బీసీల జీవితాలు మార్చడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై కేటీఆర్‌.. జగన్‌ని కలిస్తే నిస్సిగ్గుగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా వైసీపీ వైపు ఉంటారని, బీసీలకు న్యాయం చేయాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు.