బీహర్‌లో రైలు ఆపి కాల్పులు జరిపిన నక్సలైట్లు

పాట్న: బీహర్‌లో ఈ రోజు మధ్యాహ్నం రైలు పై నక్సలైట్లు దాడిచేసిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 150 మంది  నక్సలైట్లు జముయ్‌`కుందత్‌ హాల్ట్‌ మద్యలో రైలును చుట్టుముట్టారని, వారిలో కొందరు రైలెక్కి గొలుసు లాగారని ఆర్‌పీఎఫ్‌ పార్టీ ఇన్‌చార్జిగా ఆ రైలులో ఉన్న విద్యాభుషన్‌ పాండే తెలిపారు. రైలు ఆగగానే నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, బాంబులు కూడా విసిరారని ఆయన తెలిపారు. రైలులో 5గురు ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఎస్కార్ట్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారిలో ఒకరు నక్సలైట్ల కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. చుట్టుముట్టిన నక్సల్స్‌ను చూసి, కాల్పుల మోత విన్న ప్రయాణీకులు ఆందోళనకు గురికాగా ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని శాంత పరిచారు. బోగీల కిటికీలన్ని మూసివేశారు. రైలు దిగనీయకుండా ఆపారు. దిగితే చాలామంది ప్రాణాలు కోల్పోయేవారని పాండే తెలిపారు. దాదాపు అరగంట పాటు కాల్పులు జరిగాయని ఆయన పేర్కోన్నారు. ఘటనాస్థలి పూర్తిగా నక్సలైట్‌ ప్రాబల్యమున్న అటవీ ప్రాంతమని తెలుస్తోంది.