బీహార్‌ ఎమ్మెల్యేలకు భారీగా జీతాల పెంపు

నితీశ్‌ కేబినేట్‌ కీలక నిర్ణయం

పాట్నా,నవంబర్‌20(జ‌నంసాక్షి): బీహార్‌లో నితీష్‌ కుమార్‌ సారథ్యంలోని జేడీయూ-బీజేపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెల్లించే నెలవారీ మూల వేతనాన్ని 30 శాతం పెంచింది. దీంతో వారి మూలవేతనం రూ.30,000 నుంచి రూ.40,000కు పెరగనుంది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అధ్యక్షతన మంగళవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు మాజీ శాసనసభ్యులకు వేతన ప్రయోజనాలను పెంచేందుకు కూడా కేబినెట్‌ నిర్ణయించింది.

/ూష్ట్ర కేబినెట్‌ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, ఎమ్మెల్యేలు ఖరీదైన వాహనాల కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.10 లక్షల నుంచి 15 లక్షలు ఇస్తారు. విమానాలు లేదా రైలు ప్రయాణాలకు ఇచ్చే వార్షిక ట్రావెల్‌ అలవెన్స్‌ను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పొడిగించారు. శాసనసభ్యులకు ఇచ్చే నియోజకవర్గ అలవెన్స్‌ను రూ.5,000 పెంచారు. ఎమ్మెల్యేలు నెలనెలా రూ.50,000 చొప్పున నియోజకవర్గ అలవెన్స్‌లు పొందుతుంటారు.