బీహార్‌ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

పాట్నా, నవంబర్‌27(జ‌నంసాక్షి) : బీహార్‌ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఇది సిగ్గుపడాల్సిన అంశం.. పిల్లలపై లైంగిక అత్యాచారం జరిగితే.. ఏవిూ లేదంటారా? ఇలా విూరు ఎలా చేస్తారు? ఇది అమానవీయం.. అంటూ బిహార్‌ ప్రభుత్వంపై సుప్రింకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న పిల్లలపై జరిగిన అఘాత్యాలకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు మంగళవారం విచారింది. ఈ సందర్భంగా అధికారులు ముఖ్యంగా పోలీసుల తీరుపట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్‌ 377 కింద నేరాలు జరిగినట్లు మాకు కన్పిస్తోందని తెలిపింది. విూరెందుకు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేయలేదని ప్రశ్నించింది. బీహార్‌ ప్రభుత్వంపై మేం ఉత్తర్వులు జారీ చేస్తామని, 24 గంటల సమయం ఇస్తున్నామని, పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్‌ 377 కింద అభియోగాలు నమోదుచేయమని కోర్టు ఆదేశించింది. ముజఫర్‌నగర్‌ వసతి గృహం కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 24 గంటల్లో సవరించిన ఎఫ్‌ఐఆర్‌ను బీహార్‌ ప్రభుత్వం దాఖలు చేయాలని, అవి చూసిన తరవాత రాష్ట్రంలోని మిగిలిన 8 పిల్లల ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలో లేదో నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది.