బులంద్‌షహర్‌ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే

యూపి సిఎం యోగి ఆదిత్యానాధ్‌
న్యూఢిల్లీ,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  యుపిలోని బులంధర్‌షహర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలో భాగంగా మూక దాడిలో ఇన్‌స్పెక్టర్‌ సుభోద్‌ కుమార్‌ హత్యకు గురికాలేదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. న్యూఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యుపిలో మూకదాడి లేదని, బులంధర్‌ షహర్‌ ఘటన ఒక ప్రమాదమని, నేరస్తుడు తప్పించుకునే అవకాశం లేదని, రాష్ట్రంలో గోవును వధించడం పూర్తిగా నిషేధించామని, అది పూర్తిగా చట్ట విరుద్ధమని, ఈ ఘటనకు ఎస్‌పి, డిఎం దీనికి జవాబుదారీగా ఉంటారని అన్నారు. కాగా, ఇన్‌స్పెక్టర్‌ హత్య కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. సియానా ప్రాంతానికి చెందిన ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని అదనపు డిజిపి ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. ఈ హత్యలో మాలిక్‌ అలియాస్‌ జీతు ఫౌజీ అనే సైనికుడి హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరు నమోదు చేసి సైనికుడిని కోసం ఆర్మీని సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనా ప్రదేశంలో అతడు ఉన్నట్లు సోషల్‌ విూడియాలో హల్‌చల్‌ చేస్తున్న వీడియో ద్వారా నిర్ధారించవచ్చునని, కానీ జీతు కాల్పులకు పాల్పడ్డాడన్న విషయాన్ని సిట్‌ తేల్చనుందని అన్నారు. తదుపరి విచారణ నిమిత్తం జమ్ముకాశ్మీర్‌కు ఓ బృందాన్ని పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు.