బెల్లంపల్లి బేకరీల్లో ఏటా కోటిన్నర తాగునీటి దందా- అధికారుల కనుసన్నల్లో అంతా గప్ చుప్.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 20, (జనంసాక్షి )
బెల్లంపల్లి బేకరీల్లో అనధికార నీళ్ల కుంభకోణం జోరుగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు గప్ చుప్ గా మిన్నకుండి పోవడంతో వినియోగదారులు ఏటా తాగునీటి రూపేణా కోటిన్నర రూపాయలు నష్ట పోతున్నారు. ప్రతి చిన్న టీ కొట్టులో మినరల్ వాటర్ తో సేవలు అందిస్తుండగా బెల్లంపల్లి పట్టణంలోని బేకరీలు మాత్రం మంచినీరు ఏర్పాటు చేయకుండా వాటికీ సైతం ఖచ్చితంగా డబ్బులువసూలు చేస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారుల బలహీనతలను ఆసరా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా మంచినీళ్లు ఏర్పాటు చేయకుండా ఖచ్చితంగా రూ. 20 చెల్లించి మంచినీళ్ల బాటిల్ కొనుగోలు చేసేలా వినియోగదారులను మభ్యపెడుతున్నారు. ఒకవేళ వారు కొనుగోలు చేయలేక పోతే మీ స్టేటస్ ఇంతేనా అనే లాగా సదరు బేకరీ సిబ్బంది వ్యవహారిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఒక్కో బేకరీ షాపుకు ప్రతి రోజుకు కనీసం రెండు వందల వినియోగదారులు వస్తుంటారని, ఇందులో రోజుకు కనీసం వంద మంది 100 వాటర్ బాటిల్లు కొనుగోలు చేసినా కేవలం ఒక్కో బేకరీ షాపుకు 2000 రూపాయల నీళ్ల బాటిల్ల వాడకం జరుగుతుంది. బెల్లంపల్లి పట్టణంలో సుమారు 25 పైగా బేకరీ షాపులు ఉన్నాయి. ఒక్కరోజులో నీళ్ల బాటిల్ల కౌంటర్ బేకరీల్లో 50 వేల రూపాయలు జరుగుతుంది. ఈ లెక్కన బెల్లంపల్లి పట్టణంలో ఒక కోటి 82 లక్షల 50 వేల రూపాయలు వినియోగదారుల జేబుకు కత్తెర పడుతుంది. ఇలా వినియోగదారుల జేబుకు కత్తెర పడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహారిస్తు వినియోగదారులను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బేకరీల దోపిడీని అరికట్టాలని వారు కోరుతున్నారు.