బొగ్గు కుంభకోణంలో దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

ఐదు కంపెనీలపై కేసులు
బొగ్గు స్కాంలో కాంగ్రెస్‌ ఎంపీ హస్తం !
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 : బొగ్గు కుంభకోణం కేసుపై ఎట్టకేలకు సీబీఐ కదిలింది. దేశవ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కంపెనీలపై సీబీఐ మంగళవారం ఏకకాలంలో దాడులు చేసింది. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, ఢిల్లీ, నాగపూర్‌, కోల్‌కతా, ధన్‌బాగ్‌, పాట్నా, ముంబై సహా మొత్తం పది ప్రధాన నగరాల్లో తనిఖీలు కొనసాగాయి. ఏకకాలంలో దేశ వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో పలు సంస్థలతో పాటు ప్రముఖుల ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగాయి. అనంతరం 2006 నుంచి 2009 మధ్య కాలంలో జరిగిన కేటాయింపులపై దృష్టి సారించిన సీబీఐ అధికారులు మెరుపు దాడులకు దిగారు. మొత్తం 30 కంపెనీల లావాదేవీలను విచారిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లోని పలు సంస్థలపై ఏకకాలంలో దాడులు చేశారు. మరోవైపు అక్రమంగా బొగ్గు కేటాయింపులు పొందిన ఐదు కంపెనీలపై సీబీఐ తాజాగా ఐదు కేసులు నమోదు చేసింది. విన్నీ ఐరన్‌ అండ్‌ స్టీల్స్‌, నవభారత్‌ స్టీల్స్‌, జేఎల్‌డీ యవత్మాల్‌, జేఏఎస్‌ పవర్‌, ఏఎంఆర్‌ ఐరన్‌ అండ్‌ స్టీలు కంపెనీలతో గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదయ్యాయి. మోసం చేశారనే అభియోగాలపై ఈ కేసులు నమోదు చేశారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలపై మూడు నెలల పాటు ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మైనింగ్‌ పనుల్లో జాప్యంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కొన్ని కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రాథమిక విచారణ సమయంలో సీబీఐ దృష్టికి తీసుకువచ్చింది. 2005లో బొగ్గు బ్లాకులు పొందిన కంపెనీలు ఇప్పటికీ మైనింగ్‌ పనులు ప్రారంభించలేదని తెలిపింది. జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్టాల్ల్రోని కొన్ని కంపెనీలు పనులు ప్రారంభించకపోగా.. బొగ్గు గనులను సబ్‌లీజుకు ఇచ్చినట్లు సీబీఐ ఇప్పటికే గుర్తించింది. మరోవైపు, అక్రమ కేటాయింపులపై దర్యాప్తు అధికారులు 2005-09 నాటి మధ్య కాలంలో పని చేసిన ఉన్నతాధికారులను ప్రశ్నించారు.
దాసరిని ప్రశ్నించిన సీబీఐ..
బొగ్గు కుంభకోణం సెగ రాష్టాన్రికి కూడా తాకింది. ఈ కేసులో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును సీబీఐ అధికారులు విచారించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న అధికారులు బొగ్గు కేటాయింపులపై ప్రశ్నించారు. దాసరి గతంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో కొన్ని కంపెనీలకు దాసరి ఫేవర్‌ చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన హయాంలో జరిగిన కేటాయింపులపై సీబీఐ వివిధ కోణాల్లో ఆరా తీసింది. ఆయనను మరోసారి కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. అయితే, తనను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు వచ్చిన వార్తలను దాసరి నారాయణరావు ఖండించారు. ఇంతవరకు తననెవరూ విచారించలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐదు చోట్లు సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. నవభారత్‌, జీవీకే తదితర కంపెనీల్లో తనిఖీలు జరిగినట్లు సమాచారం. అదే విధంగా, ఈ కుంభకోణంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌ దర్దా ప్రమేయమున్నట్లు సీబీఐ పేర్కొంది. బొగ్గు గనులకు సంబంధించి సీబీఐ దాడులు చేసిన ఐదు కంపెనీల్లో రెండింటిలో దర్దాకు సన్నిహితమని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను సీబీఐ త్వరలో ప్రశ్నించనుంది.