బ్యాంకుల సమ్మె విజయవంతం


స్తంభించిన లావాదేవీలు.. మూగబోయిన ఏటీఎంలు
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి):
బ్యాంకింగ్‌ చట్ట సవరణను కోరుతూ అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడ్డాయి. 22 ప్రభుత్వ, 12ప్రైవేటు, 8విదేశీ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణ ముసుగులో ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్‌ ఇతర ఉద్యోగవ్యతిరేక విధానాలను నిరసిస్తూ బ్యాంక్‌ సిబ్బంది ఈ సమ్మె చేస్తున్నారు. ఢిల్లీలో ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. బ్యాంక్‌ సమ్మె వల్ల ఎటిఎంలో డబ్బు లేక వినియోగదారులు ఎటిఎం కేంద్రాలకు వచ్చి నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఈ సమ్మె రేపు కూడా కొనసాగుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐబిఎకు బ్యాంకు ప్రతినిధులకు మధ్య చర్చలు విఫలం కావడంతో తాము ఈ సమ్మెకు దిగామని ప్రజలు సహకరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక ప్రకటించింది. బ్యాంకింగ్‌ రంగంపై ప్రభావం చూపే అంశాలను నిరసించడంతోపాటు పిఎస్‌యు బ్యాంకులో మానవవనరులకు సంబంధించి ఖండ్వేల్వాల్‌ సిఫార్సులను ఏకపక్షంగా అమలు చేయడాన్ని నిరసిస్తూ దాదాపు దేశవ్యాప్తంగా పదిలక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెవల్ల సాదారణ బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఐబిఎ చీఫ్‌ రామకృష్ణన్‌ అన్నప్పటికి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలు అందక వినియోగదారులు వెనుదిరిగిపోయారు.