బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీభ్రమరాంబాదేవి
కర్నూలు,అక్టోబర్11(జనంసాక్షి): శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మ¬త్సవాలు కన్నులపండుగా జరుగుతున్నాయి. రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాయంత్రం మయూర వాహనంపై శ్రీభ్రమరాంబాదేవి సమేత మల్లికార్జున స్వామి వారి గ్రామోత్సవం జరుగనుంది. ఉత్సవాల తొలి రోజును పురస్కరించుకొని ఆలయ వేదికపై భ్రమరాంబాదేవి భక్తులకు శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. త్రిశూలధారిణియై, ఎడమ చేత పద్మాన్ని చేతపట్టి అమ్మవారు దివ్యమంగళస్వరూపంలో సాక్షాత్కరించారు. విశేష పుష్పాలంకృతంతో దేదీప్యశోభతో అమ్మవారు పూజలందుకున్నారు. ఆదిదంపతులైన శ్రీస్వామిఅమ్మవార్లు భృంగివాహనంపై కొలువుదీరారు. అర్చకులు సమంత్రకంగా పూజలు జరిపారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను గ్రామోత్సవానికి తీసుకువస్తుండగా ఈవో శ్రీరామచంద్రమూర్తి నారికేళాలు, కర్పూర హారతులు సమర్పించి ఉత్సవాన్ని ముందుకు నడిపారు. ఆలయ ప్రాంగణంలో పరివారదేవతల హారతులు అందుకుంటూ
స్వామిఅమ్మవార్లు గ్రామోత్సవానికి తరలివచ్చారు. రాజగోపురం వద్ద నుంచి కళాకారులు నృత్యాలు, డప్పు వాయిద్యాల సందడి, కోలాటాలు, చెక్కభజనలు, ఢమరుకనాదాలతో ఉత్సవం ఎదుట సందడి చేశారు. వేలాది మంది భక్తజనం తరలివచ్చి శ్రీస్వామిఅమ్మవార్ల దివ్యమంగళస్వరూపాన్ని దర్శించుకొని వేడుకున్నారు. దసరా మ¬త్సవాల రెండో రోజు గురువారం శ్రీభ్రమరాంబాదేవి భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిస్తున్నారు. మయూర వాహనంపై శ్రీస్వామిఅమ్మవార్లను కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు నిర్వహించారు.