బ్రిటీషర్ల కన్నా భాజపానే ప్రమాదం

` గాంధేయవాదానికి గాడ్సే వాదానికి పోటీయా?
` తెలంగాణలో అడుగుపెట్టనివ్వం
మోడీతో దేశానికి తీవ్ర నష్టం
ఆయనను తప్పిస్తేనే దేశానికి మోక్షం
రాహుల్‌ ఆదేశాలతో కులగణన చేపట్టాం
తెలంగాణ విముక్తికి పటేల్‌ కారణం
తెలంగాణ ఇచ్చిన సోనియా ధన్యురాలు
అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ వ్యాఖ్యలు
అహ్మదాబాద్‌(జనంసాక్షి): ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మోడీని తప్పిస్తే తప్ప దేశానికి విముక్తి లేదని అన్నారు. గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ గాడ్సే సిద్దాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని రేవంత్‌ విమర్శించారు. దేశ యువత ఏకం కావాల్సిన సమయమొచ్చిందన్నారు. యువతకు గాంధీ బాటలో నడుస్తూ.. మోదీ, గాడ్సేలను ఓడిరచాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అంటే ప్రధాని మోదీకి భయం..మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాడనే లోక్‌సభలో రాహుల్‌ గాంధీకి మైక్‌ ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో మోదీకి, అమిత్‌ షాకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప.. నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. నెహ్రూ నేతృత్వంలో పటేల్‌ నిజాం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ.. దేశాన్ని విభజించడమే మోదీ లక్ష్యం అందుకే తెలంగాణలో బీజేపీని, మోదీని అడుగు పెట్టనివ్వం అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ గాంధీ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్తుంది.దేశ యువత ఏకమై మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన -టైం వచ్చిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్‌ గాంధీ ఇచ్చిన హావిూ ప్రకారం 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడిరచారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపాలనలో దేశానికి అభివృద్ధి కన్నా మోసం ఎక్కువగా జరిగిందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్‌ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోడీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్‌ వాళ్లు ఎలా దేశ సంపదను లూటీ చేశారో, అదే బాటలో బీజేపీ నాయకులు కూడా నడుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ఆస్తులు ప్రైవేటు కార్పొరేట్‌లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. వచ్చే రోజుల్లో దేశం విూద విపరీతంగా పెరుగుతున్న బీజేపీ చెరను తొలగించాలన్న బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టనివ్వకపోవడం తమ గెలుపు సూచిక అని పేర్కొన్నారు.

తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం
` రేవంత్‌ పంపిన బిల్లుపై కేంద్రం చర్యలు తీసుకోవట్లేదు
` ఈ ప్రక్రయతోనే ఆయావర్గాలకు న్యాయం
` కుటిల యత్నాలతో అడ్డుకుంటున్న బీజేపీ
` రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న భాజాపా ఆర్‌ఎస్‌ఎస్‌
` అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సదస్సులో రాహుల్‌ గాంధీ
కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయా వర్గాలకు వారి హక్కులు లభించాలంటే ఎవరు ఎంతమంది ఉన్నారన్న లెక్క తేలాల్సి ఉందన్నారు. ఏం సంస్థలలో దళితులు, ఆదివాసీలు, ఇతర వెనకబడిన వర్గాలకు వారి వాటా దక్కడం లేదన్నారు. ఆదానీ, అంబానీ కంపెనీల ఉద్యోగుల జాబితా తీస్తే కూడా ఇది తెలుస్తుందన్నారు. ఇకపోతే రాజ్యాంగమే కాంగ్రెస్‌ ఆత్మ అని, దానిని పరిరక్షించుకునేందుకు మనమంతా కలసి పోరాడాలని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మత స్వేచ్ఛ విూద దాడి చేస్తున్నాయని రాహుల్‌ గాంధీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్‌ సమావేశంలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ అని, దానిని మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు. బీజేపీ తమ వ్యవస్థ విూద దాడి చేస్తుందని రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణాలో కులగణ అంశంపై స్పందించారు. కులగణనపై మంచి స్పందన వచ్చిందన్నారు. మైనార్టీలు, ఆదివాసులు, గిరిజనుల కోసం కాంగ్రెస్‌ పని చేస్తుందన్నారు. జాతీయ జన గణన చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో కుల గణనపై రేవంత్‌ రెడ్డి నాకు వివరించారు. తెలంగాణలో ఓసీలు, బీసీలు మైనార్టీలు ఎంత అనేది తేలింది. తెలంగాణ లో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం. రాష్ట్రంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసులకు సరైన ప్రాతినిధ్యం లేదని స్పష్టమైంది. బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి బిల్లు కేంద్రానికి పంపారు. రేవంత్‌రెడ్డి పంపిన బిల్లుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో కులగణనను విజయవంతంగా నిర్వహించారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలుస్తుంది. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తాం. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. తెలంగాణ సంపదలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన భాగస్వామ్యం లేదు. వారి జనాభాకు అనుగుణంగా సంపదలోనూ తగిన వాటా అవసరం‘ అని రాహుల్‌ గాంధీ అన్నారు. దేశ జనాభాలోని 90 శాతం మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదు. 90 శాతం మంది జనాభా అవకాశాలను లాగేసుకున్నారు. విూరందరూ లేకుండానే భారత్‌ జోడో యాత్ర రాహుల్‌ గాంధీ చేయగలడా? అని ప్రశ్నించారు. మహాత్మ గాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, అంబేద్కర్‌, గురునానక్‌, కబీర్‌ ఆలోచనల రూపం భారత రాజ్యాంగం అని రాహుల్‌ గాంధీ అన్నారు. భారత రాజ్యాంగం 75 ఏళ్ల నాటి పుస్తకంగా భావించరాదని.. వేలాది సంవత్సరాలుగా భారత దేశ ప్రజల ఆలోచన విధానమే భారత రాజ్యాంగం అని స్పష్టం చేశారు. రాజస్థాన్‌ లో సీఎల్పీ నేత దళితుడని.. గుడిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారన్నారు. ఆయన గుడికి వెళ్లిన పాపానికి గుడిని శుభ్రం చేశారని అన్నారు. ఇది బిజెపి ఆలోచనా విధానామని, కానీ తమ కార్యకర్తలు దళితులు, ఆదివాసులు అందరికీ గౌరవం ఇస్తారని చెప్పారు. దేశ సమస్యలు తీర్చాలంటే.. దేశాన్ని ఎక్స్‌రే తీయాలని కాంగ్రెస్‌ అగ్రనేత అన్నారు. దళితులు, ఆదివాసీల సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. దళితులు, ఆదివాసీలకు న్యాయం జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేం దుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్‌ విమర్శించారు. చనిపోయాక నా గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది అనవసరం. నేను అనుకున్న పనులు పూర్తి చేశాక ప్రజలు మరిచిపోయినా నాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. ఇద్దరు వ్యాపారవేత్తలకే వాటిని అప్పగిస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, గనులు, సిమెంట్‌, స్టీల్‌ సహా కీలక పరిశ్రమలన్నీ ఓ పారిశ్రామికవేత్తకే కట్టబెడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా అక్రమాల ద్వారా గెలిచింది. అక్కడ ఓటరు జాబితా కోరితే ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా రోజూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోదీని కోరాం. దీనికి ప్రధాని సహా ఆర్‌ఎస్‌ఎస్‌ తిరస్కరించింది. లౌకిక భావనకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఇకపోతే మోడీకి అత్యంత సన్నిహితుడైన ట్రంప్‌ టారిఫ్‌లతో ఆర్థిక ఉత్పాతం దూసుకు వస్తోందని హెచ్చరించారు. బంగ్లా తాత్కాలిక సారథితో సమావేశంలోనూ మోడీ నోరు మెదపలేదని అన్నారు. ఎప్పుడూ తనగురించి గొప్ప చెప్పుకునే మోడీ తన దారేందో చెప్పరని, కానీ ఇందిరా ఓ సమయంలో తనది భారత్‌ దారని గర్వంగా చెప్పారని గుర్తు చేశారు. ఈ వేదికపై సోనియా, అంబికా సోనీ, ఖర్గే, కెసి వేణుగోపాలు, సిఎం రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

ఏదో ఒకరోజు మోడీ దేశాన్ని అమ్మేస్తారు
` ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్‌ పరం
` ఎన్నికల సంస్థలు కూడా మోడీ గుప్పిటే
` అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సభలో ఖర్గే
ప్రధాని మోడీ ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ- (ఎఐసిసి) సమావేశాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ’దేశ ఆర్థిక వ్యవస్థలో గుత్తాధితప్యం నెలకొల్పబడుతోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌ దెబ్బతింది. వారు బలహీన వర్గాల వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వారు ప్రభుత్వరంగాన్ని ఒక్కొక్కటిగా అమ్మేస్తూ.. తమ స్నేహితులకు సహాయం చేస్తున్నారు. ఇదే కొనసాగితే.. మోడీ ఏదో ఒకరోజు ఈ దేశాన్ని అమ్మేస్తారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నిర్మించిన ప్రభుత్వ రంగ కర్మాగారాలను నాశనం చేస్తున్నారు. విూరు, నేను దేశం కోసం ఏం చేస్తున్నాం? భవిష్యత్‌ తరాలకు మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము? కాంగ్రెస్‌ను దుర్భాలాషలాడడం తప్ప మోడీ దగ్గర వేరే సమాధానాలు లేవు అని ఆయన అన్నారు. నేడు ఎన్నికల సంస్థలు కూడా వారి నియంత్రణలోకే వెళ్లాయి. ప్రభుత్వం ప్రతిదానిలో జోక్యం చేసుకుంటూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయి. ఎలక్టాన్ర్రిక్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో.. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఇవిఎంలను వదిలి బ్యాలెట్‌పేపర్స్‌ వైపు మళ్లాయి. ప్రపంచంలో ఇవిఎంలు ఎక్కడా అందుబాటులో లేవు. దేశంలో 140 కోట్ల మంది ప్రజాస్వామ్యాన్ని నమ్ముతారు. ఇప్పుడో లేక తరువాతో.. ఈ దేశ యువత మనకు ఇవిఎంలు వద్దు.. బ్యాలెట్‌ పేపర్లు కావాలని నినదిస్తారు అని ఖర్గే అన్నారు.భారత్‌పై అమెరికా 26 శాతం పన్నులను విధించింది. ఈ విషయంపై పార్లమెంటు చర్చించనీయలేదు. ఈ విషయంపై మేము చర్చించాలని పట్టుబట్టాము. కానీ వారు చర్చకు అనుమతించలేదు. ముఖ్యమైన ప్రజా సమస్యలను చర్చించడానికి బదులుగా.. ప్రభుత్వం పార్లమెంటు-లో మత విభజన గురించి చర్చించింది. దీనికోసం తెల్లవారుజామున 3-4 గంటల వరకు చర్చలు నిర్వహించింది. మణిపూర్‌ వంటి అంశాలపై ఉదయం 4.40 గంటలకు ప్రారంభమైంది. ఆరోజు మణిపూర్‌ అంశంపై మేము తరువాతరోజు మాట్లాడతామని అమిత్‌షాకు చెప్పాము. దీంతో ఈ విషయంపై మమ్మల్ని చర్చకే అనుమతించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ నేతలు ఇలాంటివి చేస్తున్నారు అని ఖర్గే విమర్శించారు. ఈ ప్రభుత్వానికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు. దేశంలో అన్నింటా ప్రభుత్వ ఆధిపత్యమే కొనసాగుతున్నదని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నదని, అందుకే ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.