భక్తుల ఆరాధ్య దైవం.. ముత్యాల పోచమ్మ తల్లి..

– నేటి నుండి 3రోజుల పాటు వార్షికోత్సవం
ఖానాపూర్ ఫిబ్రవరి 10(జనంసాక్షి): ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీ శ్రీముత్యాల పోచమ్మ ఆలయ 17వ వార్షికోత్సవం నేటి నుండి 13వ తేదీ వరకు జరుగనుంది. వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  సుందరంగా తీర్చిదిద్దారు. చండి ఉపాసకులు పాలెం మనోహర శర్మ, వాసుదేవాచార్యులు, అర్చకులు నిమ్మగడ్డ శరత్ చంద్ర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 11న మహాగణపతి పూజ, పుణ్యహావచనం, గోపూజ పంచాగవ్య ప్రాశనం, వరుణయానం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, మహాశక్తి న్యాస , పూర్వక శతౌషాదియుక్త మహాబలాభిషేకం, యాగశాల ప్రవేశం , అఖండ ద్విపాస్థాపన , కర్కరి,వాస్తు నవగ్రహ యోగిని , క్షేత్రపాలక సర్వతోభద్ర మండల స్థాపన, ప్రధాన కలశ స్థాపనం, అమ్మవారి ఆభరణాల ఊరేగింపు, 12వ తేదీన అమ్మవారి మూల విగ్రహానికి విశేష శిరాభిషేకం, నిత్య అర్చన మూల మంత్ర హవనం, శిలాస్థాపితం దేవతార్చనలు, స్వాతి నక్షత్ర యుక్త మీనా లగ్న సుముహూర్తమున శీల ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహిళల సామూహిక కుంకుమార్చనతో పాటు సాయంత్రం నుండి శ్రీ ముత్యాల పోచమ్మ అమ్మవారి ఉత్సవమూర్తి ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలు , అష్ట భైరవ బలి మహా నైవేద్యం, చివరి రోజైన 13వ తేదీన అమ్మవారి మూల విగ్రహానికి విశేష క్షీరాభిషేకం, పుష్పాలంకరణ, మూలమంత్ర సహిత, మహా చండి సప్తశతి హవనం, మహా పూర్ణాహుతి, అమ్మ వారి విశ్వరూప సందర్శనం , పోచమ్మ- దేశపతి రాజుల శాంతి కళ్యాణం ,మహా పట్నం, నాగవెల్లి ,సదర్ బోనాల ఊరేగింపు, భక్తులకు అమ్మవారి మహాపాయసం అందించడంతోపాటు జాతర కార్యక్రమం నిర్వహించనున్నారు. వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండాడి నాగేందర్,సభ్యులు తెలిపారు.