భాజపాతో వైకాపా, జనసేన కుమ్మక్కు


– భోగాపురం విమానాశ్రయానికి త్వరలోనే టెండర్లు పూర్తవుతాయి
– ఏపీ మంత్రి కళా వెంకట్రావు
విజయనగరం, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకే కేంద్రం సహకారం లేకపోయినా సీఎం చంద్రబాబు పట్టుదలతో ఓ పక్క ముందుకు సాగుతున్నారని, కానీ వైకాపా,  జనసేన పార్టీలు బీజేపీతో కుమ్మక్కై అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తున్నాయని మంత్రి, ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. విజయనగరంలోని అతిథి గృహంలో ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడారు. వైకాపా, జనసేన పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుపాను అతలాకుతలం చేస్తే.. బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత జగన్‌కు సమయమే లేదని ఎద్దేవా చేశారు. జనసేన పవన్‌కల్యాణ్‌ అయోమయంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నామని.. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. జిల్లా అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి త్వరలోనే టెండర్లు పూర్తవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా, కేంద్రం ఏపీపై ఎంత వివక్ష చూపుతూ వస్తున్నా తనకున్న పలుకుబడితో చంద్రబాబు ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోనడిపిస్తున్నారని అన్నారు. తత్లీ తుఫాతో విజయనగరం, శ్రీకాకుళలంలో ప్రజలు తీవ్ర నష్టపోయారని, పంటలు నష్టపోవడంతోపాటు ఆశ్రయాన్ని కోల్పోయారని అన్నారు. వీరిని అన్ని విధాలా ఆదుకొనేందుకు పరిహారం కింద కేంద్రాన్ని నిధులు కోరితే ఇప్పటి వరకు అడ్రస్సు లేదన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలుసైతం కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. ఏపీ ప్రజలపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ది ఇది అని విమర్శించారు. ప్రజలు ఏపీలో తెదేపాకే మళ్లీ పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు.