భాజపా చేస్తోంది రథయాత్ర కాదు..  రావణయాత్ర


– ఆపార్టీని ఏ రాష్ట్ర ప్రజలూ ఆహ్వానించరు
–  పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, నవంబర్‌17(జ‌నంసాక్షి) :భాజపా చేస్తోంది రథయాత్ర కాదని.. రావణ యాత్ర అని  పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. శనివారం పార్టీ కోర్‌ కమిటీ ఏర్పాటు చేసి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.. దేశంలో మతవాదాన్ని రెచ్చగొట్టే భాజపాను ఏ రాష్ట్ర ప్రజలూ కోరుకోరని ఆమె విమర్శించారు. ఆపార్టీ విభజన రాజకీయాన్ని అవలంభిస్తోందన్నారు. వారు ప్రాంతాల పేర్లను మార్చేస్తారుని, పాలసీలను మార్చేస్తారని ఇలాంటి వాళ్లు దేశానికి ప్రమాదంమని అన్నారు.  ‘భాజపాను తరిమికొట్టండి.. దేశాన్ని కాపాడండి అంటూ ‘పవిత్ర యాత్ర’ పేరుతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని 42లోక్‌సభ స్థానాల్లో పర్యటించి వాటిని ప్రక్షాళన చేస్తామన్నారు. భాజపా రథయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచి దక్షిణ 24పరగణాలు జిల్లాలోని బీర్బం, కూచ్‌బెహార్‌, గంగాసాగర్‌ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. భాజపా రథయాత్రతో అపవిత్రమైన ఈ ప్రాంతాలని పవిత్ర యాత్రతో ప్రక్షాళన చేస్తామని మమత పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో కోల్‌కతాలో మెగా ర్యాలీని నిర్వహించనున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్‌ రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈర్యాలీ 2019 ఎన్నికలకు కీలక మలుపు అవుతుందన్నారు. మతవాదాన్ని రెచ్చగొట్టే, విభజన రాజకీయాలను చేసే భాజపాను ఏ రాష్ట్ర ప్రజలూ ఆహ్వానించరంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.