భారతీయ ఉన్నతాధికారికి బెయిల్‌

న్యూయార్క్‌: ఆమెరికాలో ఒక మహిళను వేధించిన ఆరోపణలపై అరెస్టైయిన సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేంద్ర మహాపాత్రకు బెయిల్‌ లభించింది. 35,000డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌ ఇవ్వటానికి కోర్టు సమ్మతించింది. బెయిల్‌పై సురేంద్ర విడుదలైనప్పటికీ ఆగస్టు 1న కోర్టులో జరిగే విచారణకు హాజరు కావలసి ఉంది. ఒడిశాలోని సంబల్‌పూర్‌ అటవీశాఖ ప్రాంతీయ అధికారిగా ఉన్న సురేంద్ర 1985 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. న్యూయార్క్‌లో ఒక శిక్షణ కార్యక్రమానికి హాజరుకావటానికి అమెరికా వెళ్లిన 30మంది భారతీయ అధికారుల బృందంలో ఆయన కూడా ఉన్నారు. అధికారులంతా అక్కడ ఒక హోటల్‌లో దిగారు. ఆ హోటల్‌ సిబ్బందిలో ఒకరైన మహిళ తన పట్ల సురేంద్ర అసభ్యంగా ప్రవర్తించారంటూ మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే సురేంద్రపై సదురు మహిళ చేసిన ఆరోపణలు అబద్ధమని ఒరిస్సా అటవీశాఖాధిపతి పి.ఎస్‌.పది శుక్రవారం భువనేశ్వర్‌లో పేర్కొన్నారు. ఇంటర్నేట్‌ కనెక్షన్‌లో లోపం ఉంటే సురేంద్ర హోటల్‌రిసెప్షన్‌కు ఆ విషయం తెలియజేశారని, దీంతో ఒక మహిళ వచ్చి సరి చేయటానికి ప్రయత్నించినప్పటికీ సరికాలేదన్నారు. కానీ గది నుంచి వెళ్లిపోయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారొచ్చి సురేంద్రను అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు.

తాజావార్తలు