భారత్‌ తో ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాక్‌

న్యూఢిల్లీ, నవంబర్‌23(జ‌నంసాక్షి) : భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరి 24 గంటలు కూడా గడవకముందే ఆ ఒప్పందాన్ని పాక్‌ తుంగలో తొక్కింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉన్న కర్తార్‌ పూర్‌ కారిడార్‌ పేరుతో అభివృద్ధి కోసం భారత్‌ చేసిన ప్రతిపాదనకు పాకిస్తాన్‌ వెంటనే సమ్మతించింది. గురువారమే ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు భారత్‌ లోని సిక్కు యాత్రికులు.. పాక్‌ లో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ సందర్శనకు బయల్దేరారు. అయితే ఇస్లామాబాద్‌ లోని భారత హైకమిషనర్‌ అధికారులతో పాటు సిక్కు యాత్రికులను.. కనీసం గురుద్వారాను దర్శించనీయకుండా, ప్రార్థనలు చేసుకోనీయకుండా ఇస్లామాబాద్‌ బయల్దేరాలని తొందర చేశారని, అందుకోసం తమను తీవ్రంగా వేధించారని ఇండియన్‌ హైకమిషన్‌ అధికారులు ఆరోపించారు. తమపట్ల పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు చాలా దారుణంగా వ్యవహరించారని, 21, 22 తేదీల్లో గురుద్వారా నన్కానా సాహిబ్‌, సచ్చసౌదాలకు అనుమతించాల్సి ఉండగా అది జరగలేదని వారు ఆరోపించారు. భారతీయులకు జరిగిన ఈ అవమానాన్ని భారత్‌ ఖండించింది. పాక్‌ వ్యవహరించిన తీరు.. మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుందని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుందని, ఇది భారత సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. నన్కానా సాహిబ్‌ కు వెళ్తున్నదారిలో ఖలిస్తాన్‌ బ్యానర్లు చాలా కనిపించాయని, ఆందోళనకారుల నినాదాలు కూడా వినిపించాయని ఇండియన్‌ ఎంబసీ అధికారులు చెబుతున్నారు. అయితే టెర్రరిస్టుల ఆగడాలు అదుపు చేయలేకనే.. ఇప్పటికే సంబంధాలు బాగా దెబ్బతిన్న భారత్‌ తో.. ఆ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో పాక్‌ విదేశీ వ్యవహారాల అధికారులు ఒత్తిడి చేశారని పాక్‌ వైపు నుంచి వివరణలొస్తున్నాయి.