భారత రైతులపై పెప్సీ దొంగదెబ్బ

FILE PHOTO: Bottles of Pepsi are pictured at a grocery store in Pasadena, California, U.S., July 11, 2017. REUTERS/Mario Anzuoni

బంగాళాదుంప పంటపై ఏకంగా కేసు
కోటి రూపాయల పరిహారం డిమాండ్‌
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వ్యవహారం
పెప్సీ ఉత్పత్తులను త్యజించాలని నెటిజన్ల ప్రచారం
అహ్మదాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): గుజరాత్‌ బంగాళదుంప రైతులు తమకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ పెప్సీ కంపెనీ వేసిన కేసు దేశమంతటా చర్చనీయాంశంగా వుంది. దీనిపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ సాగుతోంది. అలాగే పెప్సీ ఉత్పత్తులను నిషేధించాలని నెటిజన్లు కోరుతున్నారు. పెప్సీ తదితర పానీయాలను ముట్టకుండా కంపెనీకి బుద్ది చెప్పాలని కోరుతు న్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్‌గా మారింది. మనదేశంలోని సాధారణ రైతులపై ఒక పెద్ద బహుళజాతి కంపెనీ కోర్టుకెక్కడం అసాధారణ పరిణామంగా మారింది. అందువల్ల భారత్‌ లోనే గాక ప్రపంచమంతటా ఇది చర్చనీయాంశం అవుతోంది. రైతు తన పొలంలో పండించిన పంట నుండి విత్తనాన్ని తిరిగి ఉపయోగించడం నేరమని చెప్పే దారుణమైన కేసుగా దీనిని పరిగణించాల్సి ఉంటుంది. అంతేగాక దాన్ని ఆసరా చేసుకొని భారత రైతాంగంపై బహుళ జాతి సంస్థలు స్వారీ చేస్తాయి. ఇది ఒక టెస్ట్‌ కేసు లాంటిది. రైతులు, రైతు సంఘాలు, దేశభక్తియుత శక్తులు, ప్రజాస్వామ్యవాదులంతా అప్రమత్తంగా ఉండి రానున్న ప్రమాదాన్ని నివారించాల్సి ఉంది.  పెప్సీ లాంటి బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకం ద్వారా దోపిడీ ఇంకా ఎక్కువగా చేస్తున్నాయి. వాటి నాణ్యతా ప్రమాణాలూ ప్రశ్నార్ధకమే! ఆ ఉత్పత్తుల అమ్మకాలపై దెబ్బ తీస్తే తప్ప వారు దారికి రారు. కాబట్టి కొన్ని ప్రజా సంఘాలు పిలుపిచ్చినట్టు పెప్సీ ఉత్పత్తులు వేటినీ ప్రజలు కొనకుండా వుంటే ఆ కంపెనీ దారికి రాక తప్పదు. సంఘటిత ఉద్యమం, పోరాటమే మన ముందున్న మార్గం. తద్వారా చట్టాలను, వాటి అమలులో రైతాంగ ప్రయోజనాలు పరిరక్షించేలా ప్రభుత్వాలనూ దారికి తేవాలి. ప్రపంచం లోని అతి పెద్ద ఆహార, పానీయ ప్రోసెసింగ్‌ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన పెప్సీ మన దేశంలో 1989 నుండి కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రపంచవ్యాప్త వ్యాపారం ద్వారా గత ఏడాది పెప్సీ పొందిన ఆదాయం 6,500 కోట్ల డాలర్లు అంటే రూ.4.52 లక్షల కోట్లు.. భారత్‌లో 38 పానీయాల (బెవరేజ్‌) ప్లాంట్లు, మూడు ఆహారప్లాంట్లు వున్నాయి. ఆక్వాఫినా నీళ్లు, పెప్సీ, 7 అప్‌, ట్రోపికానా తదితర శీతల పానీయాలు, లేస్‌ చిప్స్‌, కుర్కురే తదితర ఆహార ఉత్పత్తులు ఈ కంపెనీవే. ఆ లేస్‌ చిప్స్‌ తయారీకి ఉపయోగించే బంగాళదుంప విత్తనం ఎఫ్‌ఎల్‌ 2027ను సాధారణంగా ఎఫ్‌సి5 అంటారు తాము పేటెంట్‌ చేశామనీ ఆ రకాన్ని తమ అనుమతి లేకుండా ఎవరూ పండించరాదనీ, దాన్ని అమ్మరాదనీ పెప్సీ వాదిస్తోంది. గుజరాత్‌లో బంగాళదుంపలు పండించే రైతుల వివరాలు సేకరించిన కంపెనీ , వాటి శాంపిల్స్‌ తీసుకున్నారు. రహస్యంగా అన్ని వివరాలు సేకరించిన పెప్సీ ఆ రైతులు తమకు పరిహారంగా ఒక కోటి ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని అహ్మదాబాద్‌ కోర్టులో కేసు ఫైల్‌ చేసింది.  ఏప్రిల్‌ 6న విచారించిన కోర్టు ఇంజంక్షన్‌ ఉత్తర్వులిస్తూ కేసును 26కు వాయిదా వేసింది.  చట్టం పేరు చూస్తే రైతులకు, ప్లాంట్‌ వెరైటీలకు రక్షణ కల్పించడంలా అనిపిస్తోంది. కాని ఆచరణలో అది దేశీయ రైతులను అదుపాజ్ఞలలో పెట్టుకోవడానికి ఎంఎన్‌సిలకు ఉపయోగపడుతోందని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఆ చట్టం 2001 అక్టోబర్‌ 30న రాష్ట్రపతి ఆమోదం పొందింది.మన దేశంలో
విత్తన, ఔషధ రంగాలకు, సాంకేతిక పురోగతికి, సామాన్యుల ప్రయోజనాల రక్షణకు ఇండియన్‌ పేటెంట్‌ చట్టం 1970 ఎంతగానో తోడ్పడింది. కాని నయా ఉదారవాద విధానాల అమలు, డబ్ల్యుటిఒ నిబంధనలు, ఎంఎన్‌సిల ఒత్తిడితో పాలకులు దానికి తిలోదకాలిచ్చి ఈ పిపివిఎఫ్‌ఆర్‌ఎ లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు పెప్సీ చెబుతున్న ఎఫ్‌ఎల్‌2027 బంగాళదుంప విత్తనాన్ని పిపివిఎఫ్‌ఆర్‌ఎ ప్రకారం
రిజిస్టేష్రన్‌ చేయించామని, ఆ వెరైటీని  తమ అనుమతి లేకుండా పండించడం ఆ చట్టం లోని 64,65 సెక్షన్ల ప్రకారం శిక్షార్హమని పెప్సీ అభియోగం.రైతు తన పొలంలో పండించిన పంటను పేటెంట్‌ చేసిన రకాలతో సహా దాచుకోవడానికి, వాడుకోవడానికి, విత్తడానికి, తిరిగి విత్తడానికి , మారకం చేసుకోవడానికి, పంచు కోవడానికి, అమ్ముకోవడానికి హక్కులున్నాయి. అయితే ఆ ఉత్పత్తిని  ఒక బ్రాండ్‌గా అమ్మడానికి మాత్రం వీలు లేదు. అంటే బ్రాండ్‌ పేరుతో అమ్మనంతకాలం ఏ విత్తనాలనైనా రైతులు సాగు చేసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి 64, 65 సెక్షన్ల ప్రకారం ఏదైనా మరో కంపెనీ లేదా వ్యాపార సంస్థపై కేసు నమోదు చేయవచ్చు తప్ప రైతుపై అలాంటి అభియోగం మోపేందుకు ఆస్కారమే లేదు. సరిగ్గా ఈ క్లాజునే గుజరాత్‌ రైతులు, అఖిల భారత కిసాన్‌ సభ ముందుకు తెచ్చాయి. రైతులపై కేసు వేయడం ద్వారా పెప్సీ కంపెనీ చట్ట ఉల్లంఘనకు పాల్పడిందని ఎఐకెఎస్‌ నాయకత్వాన రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చట్టంలో రైతుకు రక్షణ కల్పించే బలమైన క్లాజులుండడం, దేశమంతటా ప్రజల నుండి వ్యతిరేకత రావడంతోపాటు అంతర్జాతీయంగా కంపెనీకి చెడ్డ పేరు రావడంతో పెప్సీ ఇప్పుడు కొత్త ఎత్తు వేసినట్టు కనిపిస్తోంది. రైతులు, లేస్‌ చిప్స్‌లో ఉపయోగించే రిజిస్టర్డ్‌ బంగాళాదుంప రకం సాగు చేయకుండా కట్టడి చేయటానికి కూడా కొత్త ఎత్తు వేసినట్టుంది. ‘పెప్సీకో వ్యవసాయ గ్రూపుల్లో చేరి కంపెనీ నిబంధనలను పాటించాలి.’ అని షరతులు విధించింది. రైతుల తరపు న్యాయవాది పెప్సీ ప్రతిపాదనను పరిశీలించటానికి సమయం కావాలని కోరారు. కేసు తదుపరి విచారణ జూన్‌ 12 కు వాయిదా పడింది. ఇంత జరిగాక పెప్సీ కంపెనీకి ఏమాత్రం ప్రమాణాలున్నా రైతులపై కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలి. ఇంకా కొత్త షరతులు విధించాలని ప్రయత్నిస్తే కుదరదు. వెనక్కు తగ్గుతున్నట్టు నటించి రైతులను మోసగించాలన్న కుయుక్తులు పన్నుతోంది.  పేటెంట్ల పేరిట ఎంఎన్‌సిలు భారత్‌తో సహా అనేక వర్ధమాన దేశాలపై పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల ఉత్పత్తులను మనం వాడకుండా నిషేధం విధించు కోవాలిన నెటిజన్లు కోరుతున్నారు.