భారీ వర్షాలతో కాళేశ్వరం పనులకు అడ్డంకి
ఆగిపోయిన నిర్మాణ పనులు
వరద తగ్గితేనే పనుల కొనసాగింపు
బాసరవద్ద పెరిగిన గోదావరి ఉధృతి
భూపాలపల్లి,ఆగస్ట్21(జనం సాక్షి): వర్షాలు తెరిపిస్తేనే కాళేశ్వరం పనులు కొనసాగేలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. మరోవైపు బాసర వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అటంకం కలిగింది. గత తొమ్మిది రోజులుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంపుహౌస్, గ్రావెటి కెనాల్ పనులు సాగడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి, రెండో బ్యారేజ్ మేడిగడ్డ, అన్నారం వద్ద భారీ ప్రవాహం ఉన్నందున ఇంజనీరింగ్, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యారేజ్ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో కూలీలు, యంత్రాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించ కుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 6,34,375, కన్నపల్లి పంపుహౌస్ వద్ద 7,37,500 క్యూసెకుల నీటి ప్రవాహం అధికంగా పోయింది. మేడిగడ్డ బ్యారేజ్ పనుల కోసం నిర్మించిన కాపర్ డ్యామ్‌కు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వరద పోటుతో కాపర్ డ్యామ్‌కు సిఫెజ్ ఏర్పడింది.దీంతో బ్యారేజ్ ప్రాంతంలోకి నీరు చేరుతోంది. దీనిని నిలుపుదల చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బైంసా డివిజన్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా వందల ఎకరాల్లో పంట నీటమునిగింది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నాందేడ్ వద్ద విష్ణుపురి డ్యాం గేట్లు ఎత్తడంతో బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. శ్రీ రాంసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 45.70 టీఎంసీలుగా ఉంది. బాసర మండలంలో బిత్రెల్లి వాగు పొంగి ప్రవహించడంతో బిబ్రేల్లి శివారులోని పంటభూములు, కౌట పంట భూములు వందల ఎకరాలు నీటిలో మునిగిపోయాయి. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని జలాశయాల్లో బోటింగ్ నిర్వహణను నిలిపివేస్తున్నట్లు టూరిజం ఎండీ మనోహర్ తెలిపారు. తెలంగాణలోని పేరొందిన సరస్సులు, జలాశయాల్లో పర్యాటక ఆధ్వర్యంలో కొనసాగే బోటింగ్ షికారును నిలిపివేస్తున్నట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్నవరం సరస్సుతోపాటు కుంతాల, నాగార్జునసాగర్, కోటిలింగాల ప్రాజెక్టు, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద పడవలను నడపవద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వర్షాలు తగ్గేవరకు బోటింగ్‌ను నిలిపివేయాలని వారికి సూచించారు. అలాగే రాష్ట్రంలో అత్యవసర సేవల నిమిత్తం బోట్లు, స్విమ్మర్లు, లైఫ్‌జాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.