భారత్ 146/1
ముంబై టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో భారత్ వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. మురళీ విజయ్ (70) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 169 బంతులు ఎదుర్కొన్న విజయ్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతనికి చటేశ్వర పూజారా(47) అండగా నిలిచాడు. ఇన్నింగ్స్ 14 ఓవర్ లో 39 పరుగుల వద్ద రాహుల్(24) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత విజయ్ తో కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. మంచి బంతులను గౌరవిస్తూ.. చెత్తబంతులను బౌంతులకు తరలించారు. అలాగే వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ రన్స్ రాబట్టారు. ఈ క్రమంలో విజయ్ తన కెరీర్ లో 15వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 400 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 5 వికెట్లకు 288 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ కు బట్లర్ (76), బాల్ (31) భారీ స్కోరు అందించారు. ఈ ఇద్దరూ తొమ్మిదో వికెట్ కు 54 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో అశ్విన్ 6, జడేజా 4 వికెట్లు తీసుకున్నారు. మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు. అశ్విన్ ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయడం ఇది 23వ సారి.