భావితరాల కోసమే హరితహారం
బాధ్యతగా మొక్కలను సంరక్షించాలి
వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో హరితహారం
వాకర్స్ తో కలిసి మొక్కలు నాటిన కడియం శ్రీహరి
వాలిబాల్ ప్లేయర్స్‌తో ఆటాడుకున్న ఉప ముఖ్యమంత్రి కడియం
వరంగల్,ఆగస్టు 6(జనం సాక్షి): భావితరాల భవిష్యత్ కోసమే ముఖ్యమంత్రి కేసిఆర్ గొప్ప పథకం హరితహారాన్ని అందించారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచాల్సి ఉందని, అప్పుడే సరైన వర్షాలు పడి, పంటలు పండి, పచ్చదనం నిండి కరువు లేకుండా పోతుందన్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో నేడు ఉదయం ఆరున్నర గంటలకు అక్కడి వాకర్స్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మునిసిపల్ కమిషనర్ గౌతమ్, అటవీ అధికారి అర్పన, విద్యార్థులత్ కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత వాకర్స్ తో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వాకింగ్ చేశారు. గ్రౌండ్ లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాలిబాల్ ప్లేయర్స్ తో కలిసి వాలిబాల్ కొంత సేపు ఆడారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో స్థానికులు వాకింగ్ చేసేందుకు ప్రభుత్వం 20 లక్షల రూపాయలతో ట్రాక్ ఏర్పాటు చేసిందని, ఈ ట్రాక్ చుట్టూ మూడు, నాలుగు వరసలు మొక్కలు నాటి వాకర్స్ కు ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గతంలో కూడా గ్రౌండ్స్ లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటామని, ఈసారి ట్రాక్ చుట్టూ పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటుతున్నామన్నారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు భాగంగా ముఖ్యమంత్రి కేసిఆర్ 230 కోట్ల మొక్కలు నాటాలనే ఉద్దేశ్యంతో హరితహారం కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికే మూడు విడతల హరితహారంలో 81 కోట్ల మొక్కలు నాటారని, ఈ నాల్గో విడతలో 40 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. ఈ నాల్గో విడతలో హరిత తెలంగాణ, హరిత పాఠశాల పేరుతో పెద్ద ఎత్తున పాఠశాలలు, కాలేజీలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సామాజిక అడవులు పెంచడం వల్లే పచ్చదనం పెరుగుతుందని, ఈ సామాజిక అడవుల పెంపకంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అదేవిధంగా మొక్కలు నాటిన తర్వాత వాటిని పరిరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి కేసిఆర్ తలపెట్టిన హరితహారం లక్ష్యం నెరవేరుతుందని, అందరకి పచ్చదనం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఐలయ్య, జాయింట్ కలెక్టర్ దయానంద్, కార్పోరేటర్ యాదగిరి, ఎన్సీసీ, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
————————-