భూమికోసం నిప్పంటించుకున్న శ్రీనివాస్‌ మృతి

– తెలంగాణ బిడ్డల ఆత్మాహుతిపై పలువురి ఆగ్రహం

కరీంనగర్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి): భూమి కోసం ఈనెల 3 న నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన మహంకాళి శ్రీనివాస్‌ హైదరాబాద్‌ ఆసుపత్రిలో మరణించాడు. దళితులకు భూ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఈ నెల 3న గూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆఫీస్‌ ముందు పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇరవై రెండు రోజులుగా మృత్యువుతో పోరాడిన శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.ఆత్మహత్యకు యత్నించిన మరో వ్యక్తి యాలాల పరశురాములు కోలుకున్నట్లు, రేపు(సోమవారం) డిశ్చార్జి చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శ్రీనివాస్‌ మృతితో ఆయన స్వగ్రామం బెజ్జంకి మండలం గూడెంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో ఎమ్మెల్యే రసమయి ఆఫీస్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టారు.