భోపాల్‌లో సాధ్వి విజయం సాధిస్తారు

ఆమెను మాలెగావ్‌ పేలుళ్ల కేసులో ఇరికించారు
శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
న్యూఢిల్లీ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞ సింగ్‌ ఠాకూర్‌కు మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అండగా నిలిచారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ప్రజ్ఞ సింగ్‌ భోపాల్‌ నుంచి కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. 2008 సెప్టెంబరులో జరిగిన మాలెగావ్‌ పేలుళ్ళ కేసులో ప్రజ్ఞ సింగ్‌ను అక్రమంగా ఇరికించారని చౌహాన్‌ ఆరోపించారు. ఆమెపై ఆరోపణల నమోదుకు చట్టాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఆమెను అమానుషంగా హింసించారని పేర్కొన్నారు. ఆమె అనుభవించిన బాధల గురించి ఆలోచిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుందని చెప్పారు. హిందూ ఉగ్రవాదం అనే మాటను దిగ్విజయ్‌ సింగ్‌ రూపొందించారన్నారు. ద్రౌపదిని హింసిస్తే మహాభారత యుద్ధం జరిగిందని, ప్రజ్ఞ సింగ్‌కు ఎదురైన వేధింపులను ప్రజలు అంగీకరించరని తెలిపారు. ఆమె దేశభక్తురాలని, భారత దేశ అమాయక పుత్రిక అని పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఆమె బీజేపీలో ఇటీవలే చేరారు. అనంతరం ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు ఎన్నికల కమిషన్‌ రెండు నోటీసులు జారీ చేసింది. సాధ్వి  ప్రజ్ఞ సింగ్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. 1989 నుంచి భోపాల్‌ నుంచి బీజేపీకే విజయం దక్కుతోంది. 2019లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో మే 23న తెలుస్తుంది.