మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు
పిటీషన్ కొట్టివేత.. కోర్టు సమయం వృథా
చేసినందుకు పదివేలు జరిమానా
న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి):
ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు ఆయన రూ.10వేలు జరిమానా విధించింది. గత ఎన్నికలలో ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థిపై జనగామా నుంచి 236 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థి కె. ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అంతేకాక చెల్లని ఓట్లను కూడా కలిపి లెక్కించారని ప్రతాప్‌రెడ్డి తన పిటిషన్‌లో ఆరోపించారు. హైకోర్టులో వాదోపవాదాలు జరిగిన అనంతరం ఓట్ల లెక్కింపుపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఓట్ల లెక్కింపుపై విచారణ నిలిపివేయాలంటూ పొన్నాల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది