మత్స్యకారుల అభ్యున్నతే సర్కారు లక్ష్యం – పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మత్స్యకారులకు చేప పిల్లలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌,బెస్త, బోయి సామాజికవర్గాలు ఆర్థికాభివృద్ది సాధించుకునే దిశగా గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి అనేక విధాలుగా సహకారం అందిస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువుల్లో చేపలు పెంచి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆయన తెలిపారు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందని ఆయన తెలిపారు.చేపలు పట్టడం, పెంచడంలాంటి ఆధునిక పద్దతులపై మత్య్సకారులకు శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గోదావరినది తీర ప్రాంతాలను మరింత అభివృధ్ది చేయడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఆర్థికాభివృద్ది సాధించుకునేలా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచనలు చేస్తున్నారని, ఈ ప్రాంతాన్ని తూర్పు పశ్చిమ గోదావరి తరహాలో అభివృద్ది చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈసారి 14 గ్రామాల్లోని మత్య్సకారులకు 9.63లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. చేపల ఉత్పత్తి పెరుగాలని, అదేస్థాయిలో ఎగుమతులు పెరుగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే చేప పిల్లల పంపిణీలో కొంత ఆలస్యం జరుగుతుందని మత్స్యకారులు తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెల రెండు నెలల ముందు పంపిణీ జరిగేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ చైర్‌ ఫర్సన్‌ పుట్ట శైలజ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. పట్టణంలోని చెరువులకు పూర్తిస్థాయిలో చేప పిల్లలను అందించడం జరుగుతుందని, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సహకారంతో సకాలంలో చేపపిల్లల పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. మార్కెట్‌లోని చేపల విక్రయ భవన పై అంతస్తు నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తామని ఆమె తెలిపారు.