మధ్యప్రదేశ్‌ బీజేపీ మేనిఫెస్టో విడుదల


– విడుదల చేసిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, సీఎం శివరాజ్‌ చౌహాన్‌
భోపాల్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : త్వరలో జరగనున్న మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ శనివారం మేనిఫెస్టో విడుదల చేసింది. ‘విజన్‌ డాక్యుమెంట్‌’ (దార్శనిక పత్రం) పేరుతో కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్‌, సీఎం శివరాజ్‌ చౌహాన్‌  తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేత విక్రమ్‌ వర్మ మాట్లాడుతూ… ‘ఈ విజన్‌ డాక్యుమెంట్‌ వచ్చే ఐదేళ్లలో మధ్యప్రదేశ్‌ అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ లాంటిదన్నారు. ప్రజల నుంచి విస్తృత సమాచారం సేకరించిన తర్వాత దీనికి రూపకల్పన చేశామని పేర్కొన్నారు. కాగా మహిళల కోసం బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేయడం విశేషం. 2018 మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇలా ఉన్నాయి…
– 2023 ఏడాదికల్లా నర్మద ఎక్స్‌ప్రెస్‌ వే, చంబాల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ఇండస్ట్రీరియల్‌ కారిడార్‌ అభివృద్ధి,
విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 14 వేల మెగావాట్లకు పెంచడం.
– ధరల స్థిరీకరణ నిధిని రూ.500 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచడం. తద్వారా మార్కెట్‌ ధరలు
పడిపోయినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం.
– మెట్రో ప్రాజెక్టు. గ్రావిూణ ప్రాంతాల్లో దాహార్తిని తీర్చేందుకు ‘నీల్‌జల్‌’ పథకం తదితర హావిూలను బీజేపీ మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్నారు.
కాగా మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాలకు గానూ ఈ నెల 28న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న అంచనాలతో… ఈ సారి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీ గట్టిపోటీ ఎదుర్కొంటోంది.