మరాఠాలకు 16శాతం రిజర్వేషన్లు

 

స్టడీ చేసి నివేదిక రూపొందించిన బిసి కమిషన్‌

ప్రభుత్వానికి చేరిన నివేదిక

ముంబై,నవంబర్‌15(జ‌నంసాక్షి): మరాఠాల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. వారి వెనకబాటు ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకోబుతున్నది.

రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన మరాఠాలకు మహారాష్ట్ర స్టేట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కమిషన్‌ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వాళ్లకు 16 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం 52 శాతం రిజర్వేషన్లు ఉండగా.. ఇక నుంచి అది 68 శాతానికి చేరనుంది. మహారాష్ట్ర జనాభాలో 30 శాతం వరకు మరాఠాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ కమిషన్‌కు రిటైర్డ్‌ జస్టిస్‌ ఎండీ గైక్వాడ్‌ నేతృత్వం వహించారు. వెనుకబాటుతనాన్ని నిర్ధారించే మొత్తం 25 ప్రమాణాల్లో మరాఠా జనాభా ఇముడుతుందని కమిషన్‌ తన సిఫారసుల్లో పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా.. ఇప్పుడు ఓబీసీలకు ఉన్న కోటాతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా 16 శాతం ఇవ్వాలని కమిషన్‌ తేల్చి చెప్పింది. వచ్చే 15 రోజుల్లో కమిషన్‌ సిఫారసులను మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీకే జైన్‌కు అందించనున్నారు. ఆ తర్వాత 15 రోజుల్లో ఈ సిఫారసులపై ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన పక్రియను పూర్తి చేసి కేబినెట్‌ ముందు ప్రతిపాదనలను ఉంచుతుంది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే మరాఠాలకు రిజర్వేషన్ల బిల్లును పాస్‌ చేయాలని ఫడ్నవీస్‌ ప్రభుత్వం భావిస్తున్నది. కమిషన్‌ గత 15 నెలల్లో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలను సందర్శించి మరాఠా సమాజికవర్గానికి చెందిన 2 లక్షల మందిని కలిసింది. తమకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఏడాది కాలంగా మరాఠాలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.