మరోమారు కదంతొక్కిన రైతాంగం

సమస్యల పరిష్కారానికిధానే నుంచి మార్చ్‌

30వేల మందితో కదలిన రైతు ర్యాలీ

ముంబయి,నవంబర్‌21(జ‌నంసాక్షి): తమ దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చాలంటూ మహారాష్ట్ర రైతులు, గిరిజనులు మరోమారు ఆందోళనకు దిగారు. థానే నుండి నిరసన ప్రదర్శనలను బుధవారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనలో 30వేల మంది పాల్గొన్నారు. ఈ మార్చ్‌ ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో ముగియనుంది. ఉదయం పది గంటలకు రైతులు థానె నుంచి బయలుదేరారు. సాయంత్రం 5గంటలకు వారు ముంబయిలోని సోమయ్య మైదానానికి చేరుకుంటారు. గురువారం నగరంలోని ఆజాద్‌ మైదానానికి చేరుకోవడంతో వీరి ర్యాలీ ముగుస్తుంది. అనంతరం రైతులు అక్కడే బైఠాయించనున్నారు. తమ డిమాండ్ల నెరవేరే వరకు ఆజాద్‌ మైదానంలోనే కూర్చుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీని లోక్‌ సంఘర్ష్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిని నీటి పరిరక్షణ కార్యకర్త రాజేంద్ర సింగ్‌, స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ ముందుండి నడిపిస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ముంబయిలో ట్రాఫిక్‌ జామ్‌లు అయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తోందని, రైతులకు ధర్నా చేయడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని మోర్చా జనరల్‌ సెక్రటరీ పత్రిభా షిండే వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో కూడా దాదాపు 50వేల మంది రైతులు నాసిక్‌ నుంచి కాలినడకన ముంబయికి చేరుకుని తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర మహారాష్ట్ర, విదుర్భ, అహ్మద్‌నగర్‌తో పాటు పలు నగరాల నుండి రైతులు, గిరిజనులు ఈ నిరసనలకు కదం తొక్కారు. ఈ నిరసనల్లో నీటి పరిక్షణ నిపుణులు డాక్టర్‌ రాజేంద్ర సింగ్‌, ఎంపి రాజు శెట్టి తో పాటు పలువురు పాల్గొంటున్నారు. మహారాష్ట్ర ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా ఈ మార్చ్‌కు మద్దతు తెలిపింది. ఈ ఏడాది మార్చిలో రైతులు నాసిక్‌ నుండి ముంబయికు ఆరు రోజుల పాటు భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చేపట్టిన నిరసనల్లో 40 వేలకు మంది పైగా రైతులు పాల్గొన్నారు. ఎఫ్‌ఆర్‌ఎ పెండింగ్‌ వాదనలు ఆరు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆ సమయంలో ప్రభుత్వం హావిూనిచ్చిందని, కానీ నెరవేర్చడంలో విస్మరించదని లోక్‌ సంఘర్ష్‌ మోర్చా జనరల్‌ సెక్రటరీ ప్రతిభా షిండే అన్నారు. స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ)కింద పెండింగ్‌లో ఉన్న వాదనలపై దృష్టి సారించాలని, కనీస మద్దతు ధర దాని అమలు నిర్ధారణకు న్యాయవ్యవస్థను ఏర్పాటు చేయాలని, సాగు భూమి కాని రైతులకు ఎకరాకు 50 వేలు, సాగుభూమికి రైతులకు,ఇతర సమస్యలకు రూ. లక్ష రుణమాఫీ చేయాలని, డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు.