మరోమారు తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ,నవంబర్‌24(జ‌నంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, డిమాండ్‌ లేమితో బంగారం ధర మరోమారు తగ్గింది. శనివారం నాటి మార్కెట్లో రూ. 200 తగ్గడంతో 10గ్రాముల పుత్తడి రూ. 31,750గా ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు పెరుగుతాయనే సంకేతాలు డాలర్‌, బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కూడా పెద్దగా కొనుగోళ్లు లేకపోవడంతో పసిడి ధర అమాంతం పడిపోయిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో మొత్తంగా బంగారం ధర రూ. 400 తగ్గింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణెళిల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ఇవాళ ఒక్క రోజే వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో నేడు బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 37,300కు పడిపోయింది. ఈ వారం మొత్తంలో వెండి ధర రూ. 850 తగ్గింది.