మరోమారు పాక్‌ వెళ్తున్నా: సిద్దూ

న్యూఢిల్లీ,నవంబర్‌24(జ‌నంసాక్షి): పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మరోసారి పాకిస్థాన్‌ వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆహ్వానం మేరకు సిద్దూ పాక్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తనకు ఆహ్వానం అందిందని సిద్దూ చెప్పారు. ఈ మేరకుకర్తార్‌పూర్‌ బోర్డర్‌ మార్గాన్ని తెరిచేందుకు పాక్‌ ప్రిపేరైంది. ఈ సందర్భంగా భారీ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌.. మాజీ క్రికెటర్‌ సిద్ధూకు ఆహ్వానం పంపారు. బాబా గురు నానక్‌ రెండు దేశాలను కలిపేందుకు సహకరిస్తున్నారని ఈ సందర్భంగా సిద్దూ తెలిపారు. తన స్నేహితుడు ఇమ్రాన్‌ మళ్లీ రమ్మన్నారని, తాను పాక్‌కు వెళ్తున్నట్లు సిద్దూ చెప్పారు. నవంబర్‌ 28న కార్తార్‌పూర్‌ బోర్డర్‌ వద్ద పాక్‌ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి సిద్ధూ హాజరవుతున్నట్లు పాక్‌ మంత్రి ఫవర్‌ చౌదరీ ఇటీవల తెలిపారు. ఈ ఏడాదిలోనే పాక్‌కు సిద్దూ వెళ్లడం ఇది రెండవ సారి. ఇమ్రాన్‌ ప్రమాణోత్సవానికి సిద్దూ వెళ్లిన విషయం తెలిసిందే. పాక్‌లోని కర్తార్‌పూర్‌లో సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ ఉన్నది. అయితే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా నుంచి అంతర్జాతీయ సరిహద్దు విూదగా భారతీయ యాత్రికులు వెళ్లేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నది.