మల్కాపూర్‌ రిజర్వాయర్‌కు ఆదిలోనే హంసపాదు

నిర్మాణానికి లింగపల్లి గ్రామస్థుల నిరాకరణ

మమ్మల్ని ముంచి ఎవరికో న్యాయం చేస్తే ఎలా అని నిలదీత

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెగేసి చెప్పిన గ్రామస్థులు

లింగంపల్లి గ్రామస్తుల ముఖాముఖిలో ఎటూ తేలని వ్యవహారం

జనగామ,ఆగస్టు13(జ‌నం సాక్షి): మల్కాపూర్‌ రిజర్వాయన్‌కు అడ్డంకులు తొలగనున్నాయనుకుంటున్న దశలో లింగపల్లి గ్రామస్థులు మెలిక పెట్టారు. తమను ముంచి ఇతరకులకు లాభంచేతామంటే ఊరుకోబోమని ఖరాఖండిగా చెప్పారు. తమను నట్టేట ముంచుతామంటే ఊరుకునేది లేదన్నారు. దీంతో మల్కాపూర్‌ రిజర్వాయర్‌కు పరిపాలనా అనుమతలు వచ్చినా, నిధులు మంజూరైనా ఇప్పట్లో ముందుకు సాగడం కష్టంగా మారనుంది. ఆదివారం ముంపు గ్రామమైన లింగంపల్లి గ్రామస్తుల అభిప్రాయం తీసుకోవడం కోసం వెళ్లిన ప్రజాప్రతినిదులకు గ్రామస్థులు తమ అభిప్రాయాలను ఖరాఖండిగా చెప్పారు. ప్యాకేజీ కింద ఏమిస్తారో చెప్పకుండా మమ్మల్నే చెప్పమంటే ఎలా అని వారిని నిలదీసారు. అయితే గ్రామస్తుల అంగీకారం మేరకే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హావిూ ఇచ్చారు.

లింగంపల్లి, మల్కాపురం వద్ద 10.78 టిఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం 3220 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చాయి. దేవాదుల ద్వారా ఈ రిజర్వాయర్‌ను నింపడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఇక కరవు లేకుండా చేయానల్న కడియం శ్రీహరి సంకల్పం మేరకు సిఎం కెసిఆర్‌ గతంలోనే అంగీకరించారు. ఈ మేరకు గ్రామస్థులతో జరిపిన ముఖాముఖి అభప్రాయాలను ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని కడియం చెప్పారు. రిజర్వాయర్‌ నిర్మాణం కోసం లింగంపల్లి గ్రామస్తులు అభిప్రాయం తెలుసుకునేందుకు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, జనగాం కలెక్టర్‌ వినయ్‌ కృష్టారెడ్డి, దేవాదుల చీఫ్‌ ఇంజనీర్‌ బంగారయ్య, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆ గ్రామస్తులతో లింగంపల్లిలో నిర్వహించిన ముకాముఖి సత్ఫలిలను ఇచ్చింది. ఈ ముఖాముఖిలో గ్రామస్తులు, గ్రామ ప్రజా ప్రతినిధులు చాలామంది వారి అభిప్రాయాలు వెల్లడించారు. అయితే ప్రజలను ముంచి బతుకుదెరువు లేకుండా చేసే ప్రాజెక్టు వద్దు అన్నారు. ఎవరికో తాగునీరు, సాగునీరు ఇవ్వడం కోసం గ్రామాన్ని ముంచుతాం అంటే ఒప్పుకోమన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని సంబర పడితే… ఇప్పుడు ప్రాజెక్టు పేరుతో ముంచుతాం అంటే అంగీకరించమని చెప్పారు. ప్రభుత్వం పదే, పదే ప్యాకేజీ ఏం కావాలో అంటుంది తప్ప, ప్రాజెక్టు కడితే ప్రభుత్వం తరపున ఏం చేస్తామో చెప్పకపోవడం,మమ్నల్నే ప్యాకేజీ గురించి చెప్పమనడం మోసం చేయడంగా భావిస్తున్నామని అమన్నారు. అందుకే ప్రాజెక్టు వద్దు అన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు, ఆవేదన, ఆక్రోశం విన్న కడియం శ్రీహరి మాట్లాడారు. లింగంపల్లి గ్రామస్తుల అంగీకారం,అభిప్రాయం మేరకే ప్రాజెక్టుపై నిర్ణయం ఉంటుందని హావిూ ఇచ్చారు. నమ్ముకున్న గ్రామాన్ని, నమ్ముకున్న భూములను వదిలిపెట్టి వెళ్లాలంటే ఉండే బాధను నేను అర్ధం చేసుకోగలనని అన్నారు. స్థానికులను ముంచి వేరే వారికి న్యాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. తాగునీరు, సాగునీరు అందించాల్సిన అవసరం లేదన్నారు. వాస్తవంగా అన్ని జిల్లాల్లో పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. మన వరంగల్‌ జిల్లాలో పెద్ద రిజర్వాయర్‌ లేదు. చిన్న, చిన్న రిజర్వాయర్లు ఉన్నాయి. మా వరంగల్‌ జిల్లాలో కూడా పెద్ద రిజర్వాయర్‌ కట్టాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను సర్వే చేయమన్నారు. వారు గీసుకొండ, మైలారం, స్టేషన్‌ ఘన్‌ పూర్‌, గండి రామారం రిజర్వాయర్లు సర్వే చేసి, వాటిని పెంచడానికి చూశారు. కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత తక్కువ ముంపుతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం మల్కాపురం, లింగంపల్లి మధ్య ఉందన్నారు. దాని ప్రకారం నివేదిక ఇచ్చారు. అయినా ప్రాజెక్టు కట్టాలన్న, పనులు చేయాలన్న విూ అంగీకారం లేకుండా ముందుకు పోయే అవకాశం లేదని స్పష్టీకరించారు. గ్రామస్తులను ఒప్పించాలని సిఎం కేసిఆర్‌ అంటే మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలన్నప్పుడు విూ గ్రామకమిటీతో ఒకటికి పదిసార్లు కూర్చోని మాట్లాడుతాం, ఫర్వాలేదు మేం ఒప్పుకుంటామని అంటేనే పని చేస్తాం తప్ప లేకపోతే చేయమని కడియం శ్రీహరి చెప్పారు. ఈ ప్రాజెక్టుపై తేలే వరకు మళ్లీ విూ ఊరికి ఎన్నిసార్లు రమ్మంటే అన్ని సార్లు వస్తాను, అన్నిసార్లు మాట్లడడానికి సిద్దంగా ఉన్నాను అన్నారు.