మళ్లీ టీడీపీ రాకుంటే.. ఏపీ భవిష్యత్‌ అంధకారం 

ఢిల్లీలో ధర్మపోరాటానికి.. సమాయత్తం కండి
– కేంద్రం మొండివైఖరిని దేశవ్యాప్తంగా ఎండగడదాం
– హావిూలు అమలు చేయండంటే దాడులు చేస్తున్నారు
– వైసీపీతో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది
– మూడు పార్టీలు లాలూచీపడి ఏపీకి అన్యాయం చేస్తున్నాయి
– నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో పాల్గొనండి
– నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు చేపట్టి.. కేంద్రం తీరును ఎండగట్టండి
– గవర్నర్‌ ప్రసంగం నాలుగేళ్ల అభివృద్ధికి ప్రతిబింబం
– ప్రజా సాధికారతే టీడీపీ లక్ష్యం
– టెలికాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి,జనవరి31(జ‌నంసాక్షి): ఎపిలో తిరిగి టిడిపి అధికారంలోకి రావాలని,లేకుంటే రాష్ట్ర అభివృద్ది వెనక్కి పోతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టాలన్నారు. నాలుగేళ్లుగా విభజన హావిూలను విస్మరిస్తూ ఏపీని కేంద్రం మోసం చేస్తుందని, ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఢిల్లీలో ఫిబ్రవరి 11న చేపట్టబోయే ధర్మపోరాటానికి ఇప్పటి నుంచే అందరూ సమాయత్తం కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రంలో బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరించాలన్నారు. పార్లమెంటులో ఎంపీలు పోరాటం ఉధృతం చేయాలని తెలిపారు. ఢిల్లీ దీక్షకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని చంద్రబాబు ఆదేశించారు. 60ఏళ్ల నష్టం పూడ్చడానికి 15ఏళ్లు పడుతుందని…కానీ ఐదేళ్లలో స్వయం కృషితో ఇంత అభివృద్ధి, సంక్షేమం సాధించామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ లాంటి నగరం నిర్మించడానికి 20 ఏళ్లు పడుతుందన్నారు. రూ.5లక్షల కోట్లు కావాలని విభజనకు ముందే డిమాండ్‌ చేశామని, అఖిలపక్ష సమావేశంలో అదే అందరూ గుర్తుచేశారని తెలిపారు. ఇవ్వాల్సింది ఇవ్వకుండా బీజేపీ తమపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. వైసీపీతో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అటు కేసీఆర్‌, ఇటు జగన్‌ ఏపీకి నష్టం చేస్తున్నారని, మూడు పార్టీలు లాలూచీపడి ఏపీకి అన్యాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమర్ధ పాలనకు కేంద్రంలో బీజేపీయే రుజువన్నారు. మోదీ చేతకానితనం ప్రజలకు శాపమయిందని వ్యాఖ్యానించారు. అన్నాహజారే మళ్లీ దీక్ష చేసే దుస్థితి వచ్చిందన్నారు. ఏపీనే కాదు అన్నాహజారేనూ మోసం చేసిందని తెలిపారు. మోదీ ఒంటెద్దు పోకడలు నచ్చక జాతీయ గణాంకాల కమిషన్‌లో ఇద్దరు సభ్యులు రాజీనామా చేశారన్నారు. సీబీఐ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీశారన్నారు. అన్ని వ్యవస్థలు కుంటుపడేలా ప్రధాని మోదీ నిర్వాకాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నేటి ఆందోళనల్లో పాల్గొనండి..
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని, నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు చేపట్టాలన్నారు. ప్రజాసాధికారతే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుగులేని శక్తిగా ఏపీ రూపొందాలని, కావాల్సిన పునాదులు వేస్తున్నామని తెలిపారు. ఏపీ టీడీపీ వల్లే నిలదొక్కుకుందని అది ప్రతి ఒక్కరికి గర్వ కారణమని
అన్నారు. టీడీపీ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ రాకపోతే రాష్ట్రంలో అరాచకం నెలకొంటుందని, భవిష్యత్‌ అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, పెన్షనర్లు టీడీపీకి అండదండ అని, అన్నివర్గాల మద్దతు టీడీపీకి ఏకపక్షం కావాలని నేతలతో చంద్రబాబు అన్నారు. గవర్నర్‌ ప్రసంగం నాలుగేళ్ల అభివృద్ధిని ప్రతిబింబించిందన్నారు. పేదలకు చేసిన సంక్షేమానికి గవర్నర్‌ ప్రసంగం నిదర్శనమని పేర్కొన్నారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, గ్రామాల్లో ప్రచారం చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు.