మళ్లీ పుంజుకున్న రైతుఉద్యమం
న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి):
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు సరిహద్దుల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. పోలీసులు బోర్డర్ ఖాళీ చేయమన్నా పట్టు వీడటం లేదు రైతులు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లబోమంటూ ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు నిన్నటి నుంచి ఆందోళనలకు యూపీ, హరియాణా రైతులనుంచి మద్దతు పెరుగు తోంది. వేలాదిగా తరలివస్తోన్న రైతులు సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్‌లకు చేరుకుంటున్నారు. దీంతో ఘాజీపూర్ బోర్డర్‌లో ట్రాక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సింఘు బోర్డర్లో స్థానికులు, రైతుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఓ వైపు రైతులు ఖాళీ చేయమని పట్టుబడుతుంటే.. స్థానికులు కూడా ఆందోళనలకు దిగుతున్నారు. వెంటనే సరిహద్దులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు.