మసూద్‌ను అప్పగించే వరకు పోరాడాలి

పాక్‌పై ఒత్తిడి పెంచడమే భారత్‌ ముందున్న లక్ష్యం
పాక్‌ చెరలో ఉన్నంత కాలం ఉగ్ర కార్యకలాపాలు ఆగవు
న్యూఢిల్లీ,మే2(జ‌నంసాక్షి): మసూద్‌ అజార్‌ను ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో దౌత్య పరంగా భారత్‌కు పెద్ద విజయం దక్కిందనే భావించాలి. అయితే అజార్‌ను పాక్‌ భారత్‌కు అప్పగించే వరకు విశ్రమించకుండా పోరాడాల్సి ఉంది. భారత్ల్‌ఓ విఇధ ఉగ్ర ఘాతుకాలకు సంబంధించి అజార్‌ ప్రమేయంపై భారత్‌ అనేక రుజువునలు పాక్‌కు ఇచ్చింది. ఇటీవలి పుల్వామా ఘటన వరకు పాక్‌పై ఒత్తిడి పెంచింది. దీని దృష్ట్యా ఇప్పుడు పాక్‌పై మరింత ఒత్తిడి పెంచే పనిలో భారత్‌ ఉండాలి. పాక్‌ ఆధీనంలో ఉన్న మసూద్‌ అజార్‌ను అప్పగించే వరకు భారత్‌ తన ప్రయత్నాలు వీడరాదు. మసూద్‌ అజార్‌… పాకిస్థాన్‌ ఆధారిత జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు. అతడిని నరరూప రాక్షసుడిగా పేర్కొనవచ్చు. భారత్‌ అంటే అతడికి ద్వేషం. భారత్‌లో విధ్వంసాలు సృష్టించడానికి ఎన్నో కుట్రలు పన్నాడు… ప్రణాళికలను అమలు చేశాడు. 2000 సంవత్సరంలో జైష్‌ ఎ మహ్మద్‌ను స్థాపించాడు. తమ ఉగ్ర సంస్థలో చేరిన యువతను భారత్‌పై విద్వేషం చిమ్మేలా తయారు చేసేవాడు. జైష్‌ ఎ మహ్మద్‌ను స్థాపించిన తదుపరి ఏడాదే భారత పార్లమెంటుపై ఆ ఉగ్ర సంస్థ దాడి జరిపింది. ఎట్టకేలకు
అతడిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. తమ ఉగ్ర భావాలను వ్యాప్తి చేస్తూ
విరాళాలు సేకరిస్తూ, కొత్త వారిని తమ సంస్థలో చేర్చుకునే పనిలో మసూద్‌ నిమగ్నమయ్యాడు. జాంబియా, అబు దాబి, సౌదీ అరేబియా, మంగోలియా, యూకే, అల్బేనియాల్లో ఉగ్రవాద ప్రచారాన్ని కొనసాగించాడు. ఆల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌తోనూ మసూద్‌.. సన్నిహితంగా ఉండేవాడు.
1968న పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని బహావల్‌పూర్‌లో జన్మించిన మసూద్‌ అజార్‌  తండ్రి పేరు అల్లా బఖ్ష్‌ షబ్బిర్‌ ఓ టీచర్‌. ఆయన ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యయుడిగా పనిచేసేవారు. షబ్బిర్‌కు ఉన్న 11 మంది సంతానంలో మసూద్‌ అజహర్‌ ఒకడు. అతడు 1989లో డిగ్రీ పట్టాను అందుకుని, ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. అయితే, ఆ మదర్సాపై ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ అన్సార్‌ ప్రభావం ఉండేది. ఆ సమయంలో మసూద్‌.. ఇందులో చేరాడు. అనంతరం అఫ్గానిస్థాన్‌లో ఆ సంస్థ నిర్వహించే జిహాద్‌ శిక్షణ శిబిరంలో చేరాడు. అయితే, తన అసమర్థత కారణంగా ఆ శిక్షణను పూర్తిగా తీసుకోలేకపోయాడు. అనంతరం సోవియట్‌ అప్గాన్‌ యుద్ధంలో పనిచేసి, గాయాలతో అందులోంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత హర్కత్‌ ఉల్‌ అన్సార్‌ ఉగ్ర సంస్థ భావాలు ప్రచారం చేసే శాఖ బాధ్యతలను చేపట్టాడు. ఓ ఉర్దు పత్రికను కూడా నడుపుతూ ఉగ్రవాద భావాలను ప్రచారం చేశాడు. అనంతరం ఆ ఉగ్రవాద సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, పలు దేశాల్లో పర్యటించాడు. 2008 డిసెంబరులో ముంబయిలో లష్కరే తోయిబా ఉగ్రదాడి జరిపిన తర్వాత ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన పాకిస్థాన్‌ ఆ సమయంలో అరెస్టు చేసిన పలువురు ఉగ్రనేతల్లో మసూద్‌ కూడా ఉన్నాడని చెప్పింది. అనంతరం ఆరేళ్ల పాటు ఆయన కనపడలేదు. జనవరి 26, 2014న ముజప్ఫరాబాద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో కనపడ్డాడు. కశ్మీర్‌లో జిహాదే తన లక్ష్యమని చెప్పుకున్నాడు. 2016లో పఠాన్‌కోట్‌లోని భారత్‌ ఎయిర్‌బేస్‌పై దాడి వెనుక మసూద్‌ ఉన్నాడు. ఆ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులతో అంతకు ముందు అతడు నేరుగా సంప్రదింపులు జరిపాడు. ఈ దాడిపై పాక్‌కు భారత్‌ వివరణపత్రం సమర్పించింది. ఫిబ్రవరి 14, 2019న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాది… భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌ పై దాడి జరిపి, 40 మంది ప్రాణాలు తీశాడు. ఈ దాడి తామే చేశామని, ఆ ఉగ్రసంస్థ ప్రకటన చేసింది. ఇలా భారత్‌పై విద్వేషాలు చిమ్మడం, దాడులు చేయించడం, జమ్ముకశ్మీర్‌ యువతను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా పనిచేసిన మసూద్‌.. చివరకు ఐక్యరాజ్య సమితి చేత అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. బంగ్లాదేశ్‌ విూదుగా పోర్చుగీసు పాస్‌పోర్టుతో భారతదేశంలో ప్రవేశించినపుడు 1994 ఫిబ్రవరిలో దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ ప్రాంతంలో అజార్‌ను అనుకోకుండా అరెస్టుచేశారు. విడిపించు కోవడానికి కాందహార్‌ విమానాన్ని  హైజాక్‌ చేసిన తరవాత పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి అతడు బాగా కావల్సిన వ్యక్తి అయిపోయాడు. 1999 డిసెంబరు 31న భారత్‌ అతడిని విడుదల చేసిన తర్వాత కరాచీలోని బినోరీ మసీదులోని మతగురువులకు ఐఎస్‌ఐ నచ్చజెప్పి అతడి నాయకత్వాన్ని కట్టబెట్టింది. అలా 2000 జనవరి 31న జైషే మహ్మద్‌ ఏర్పడింది. విడుదలైన తర్వాత మసూద్‌ అజార్‌ జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు తెగబడ్డాడు. అందువల్ల పాక్‌పై ఒత్తిడి పెంచి అతడిని భారత్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.అప్పుడే ఉగ్ర కార్యకాలపాలకు చెక్‌ పడుతుంది.