మహాకూటమికి దూరంగా సిపిఎం
ఎపిలో ఒకలా..తెలంగాణలో మరోలా విధానాలు
ఎటూ తేల్చని జనసేన పార్టీ
హైదరాబాద్,సెప్టెంబర్22(ఆర్‌ఎన్‌ఎ): తెలంగానలో సిపిఎం తప్ప దాదాపు అన్ని పార్టీలు మహాకూటమి వైపు మళ్లాయి. ఎపిలో కూడా జనసేనతో లెఫ్ట్ పార్టీలు మహాకూటమికి యత్నిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరబద్రంమాత్రం ఉమ్మడి పోరుకు మోకాలడ్డడం, ఒంటరి పోరంటూ ప్రకటన చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన బిసి ముఖ్యమంత్రి అంటూ బహుజన ఫ్రంట్ పెట్టారు. దీనివెనక ఎవరున్నారన్నది త్వరలో తేలనుంది. ఇకపోతే ఎపిలో చంద్రాబును విమర్విస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో మాత్రం కెసిఆర్ పాలనను పొగుడుతూ వచ్చారు. ఈ దశలో జనసేన తెలంగాణలో ఎలాంటి రోల్ పోషించనుందో తెలియడంలేదు. ఆ పార్టీకి ఇక్కడా అభిమానులు ఉండివుంటారు. వారంతా ఎటు అన్నది తేలాల్సి ఉంది. మహాకూటమితో జతకడతారా లేక, టిఆర్‌ఎస్ వెంట నడుస్తారా అన్నది కూడా తెలియడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయా పార్టీల నేతలు ఆచితూచి రాజకీయ సంబంధాలు నెరుపుతున్నారు. ఎపిలో లెఫ్ట్ నేతలు జనసేనతో పొత్తుకు సై అంటున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా బలపడాలనే పక్కా వ్యూహంతో ఉన్నారు. మిగతా పార్టీలతో ఏమాత్రం తీసిపోకుండా జిల్లా స్థాయిలోనూ ఎత్తుగడగా ఉంది. అయితే ఎపిలో ఒకవిధానం, తెలంగాణలో మరో విధానంతో సిపిఎం ఉంది. గత ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పోటీపడినా విజయాన్ని మాత్రం మూటకట్టుకోలేకపోయారు. దీనిపైనే వామపక్షాల కార్యకర్తలు, నాయకులు ఆత్మవిమర్శ చేసుకున్నారు. ఎన్నికల వ్యూహరచనలో తాము ఎలాంటి ఎత్తుగడలు పాటించాలో, చురుకైన
వ్యూహం రూపొందించి ఎలా పదునుపెట్టాలో.. ప్రజా ఉద్యమాల్లో కొనసాగినందుకుగాను అదే రీతిలో ప్రజా మద్ధతు ఓట్ల రూపంలో దక్కించుకునేదెలా.. అనేదానిపైనే ఇప్పుడు వామపక్షాలు సుదీర్ఘ కసరత్తు ప్రారంభించాయి. ఇంతకుముందు చూసిన ఎన్నికలు వేరు.. తాజాగా జరగబోయే ఎన్నికలు అంతకంటే వేరు అనే భావనలో వామపక్షాలు ఉన్నాయి. యువతలో మార్పు రావాలనే సారూప్యతా భావాలు, మిగతా పార్టీల అధినేతలతో పోలిస్తే జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ పద్ధతి భిన్నంగా ఉండడం, వామపక్ష భావజాలం, పోకడలకు ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ఆకర్షితుడై ఉండడం వామపక్షాల ఆశల్లో ఇప్పటికీ కాస్తంత ఉత్తేజం పెంచింది. ఎన్నికల సమయంలో కేడర్ యావత్తు భుజాలు అరిగేలా పార్టీ జెండాలు మోసినా, దాని ఫలితం ప్రత్యక్షంగా ఉండకపోవడం, తరచూ అసెంబ్లీ, పార్లమెంటుల్లో వామపక్షాల ప్రాతినిధ్యం తగ్గుముఖం పట్టడం వంటి పరిణామాలు సహజంగానే చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయి. అయినా పార్టీ నేతల వ్యవహారాల కారణంగా సవిూకరణాలు మారుతున్నాయి.