మహాలక్ష్మీదేవిగా..  దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ


– దసరా పండుగ సవిూపిస్తుండటంతో కొండపైకి భవానీల రాక
– అరుణవర్ణం సంతరించుకున్న ఇంద్రకీలాద్రి పరిసరాలు
ఇంద్రకీలాద్రి, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు మంగళవారంకు ఏడో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వరాలిచ్చే తల్లిగా, సిరిసంపదలు కురిపించే మాతగా మహాలక్ష్మీదేవి రూపానికి పేరుంది. అందుకే ఈ రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కృష్ణానదిలోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా సవిూపిస్తుండటంతో కొండపైకి భవానీల రాక మొదలైంది. దీంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణ వర్ణం సంతరించుకుంటున్నాయి. వినాయక ఆలయం వద్ద క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులు… ఘాట్‌ రోడ్డు మార్గంలోని కామధేను అమ్మవారిని దర్శించుకుని కొండపైకి వచ్చి జగన్మాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మంగళవారం కావటం.. మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు అభయమివ్వండంం మంగళవారం ప్రత్యేకత. లోక స్థితికారిణిగానూ మహాలక్ష్మి అమ్మవారికి పేరుంది. అలాగే ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రకటించే అష్టలక్ష్ముల సమిష్టి రూపంగా శ్రీమహాలక్ష్మిదేవి రూపాన్ని పేర్కొంటారు. పద్మంపై ఆశీనురాలైన ఆ జగన్మాత తన చేతుల నుంచి కనకవర్షాన్ని కురిపిస్తున్న రూపాన్ని చూడటం ద్వారా వారి ఇంట సిరికి లోటుండదని భక్తుల నమ్మకం.

తాజావార్తలు