మాయావతి విగ్రహాం తల తీసివేత

నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి
లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని యుపి నవ నిర్మాణ సేన ఈ సంఘటనకు తామే భాద్యులంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. మాయ హయాంలో జరిగిన కుంభకోణాలకు నిరసనగా తమ వలంటీర్లు ఈ పనిచేసినట్లు సేన నాయకులు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి మరీ తెలపడం విశేషం. రాష్ట్రంలో వివిద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మాయావతి విగ్రహాలను తొలగించమని తాము యూపి సిఎం అఖిలేష్‌యాదవ్‌ను కోరామని, అయితే ఆయన పట్టించుకోకపోవడంతో తామే ఈ పని చేశామని వారు తెలిపారు. మాయ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయని, అయినా జాతికి మేలుచేసిన ఓ మహా నాయకురాలులా మాయావతి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసుకుందని విమర్శించారు. మాయా హయాంలో చోటు చేసుకున్న అనేక కుంభకోణాలకు తాము ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. మిగిలిన మాయావతి విగ్రహాలను తొలగించేందుకు వారు యూపి సిఎం అఖిలేష్‌కు 48 గంటల గడువు విధించారు. పార్కులోని సెక్యూరిటీ సిబ్బంది కథనం ప్రకారం రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు యువకులు ఏం జరుగుతుందో గ్రహించేలోపే విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కాగా వివిధ పార్కులలో విగ్రహాలకు భద్రతను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ వార్త తెలిసిన తర్వాత బిఎస్‌పి సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వమే దీనికి భాద్యత వహించాలనీ, ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వమని బిఎస్‌పి నేత ప్రసాద్‌ మౌర్య అన్నారు. దీనిని యూపి సిఎం అఖిలేష్‌యాదవ్‌ ఖండించారు. ధ్వంసమైన విగ్రహానికి ప్రభుత్వ ఖర్చుతో మరమ్మత్తులు చేయించనున్నట్లు ఆయన తెలిపారు.