మారుతి సుజుకీ కంపెనీ లాకౌట్
హర్యానాలో కార్మికుల నోట్లో మన్ను
హర్యానా : హర్యానా రాష్ట్రంలోని మానేసార్‌లో కిందటి బుధవారం మారుతి సుజుకి కంపెనీలో జరిగిన ఘర్షణలో జనరల్ మేనేజర్ అవనీష్ కుమార్ మృతి చెందిన తెలిసిందే. ఈ ఘర్షణకు కారణమైన వారిని అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనపై దర్యాప్తు సజావుగా సాగేందుకు కంపెనీని లౌకౌట్ చేస్తున్నామని, దీంతోపాటు తన సహచరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చైర్మన్ భార్గవ ప్రకటించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఉత్పత్తి జరుపమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటివి మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే ఈ కంపెనీని గుజరాత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియా చైర్మన్ ముందు ప్రస్తావిస్తే అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. అయితే, జరిగిన ఘర్షణపై విచారణ సాగుతుంటే, కంపెనీని లాకౌట్ చేయడంలో అర్థం లేదని కార్మికులు వాదిస్తున్నారు. కంపెనీ లాకౌట్‌తో 3 వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణకు బాధ్యులపై తీసుకోండి కానీ, కంపెనీ లాకౌట్‌ను ఎత్తేయాలని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.