మార్కెట్లకు కన్నడ గాలి

– అమాంతం పైకెగిరి.. స్వల్ప నష్టాల్లోకి పడిపోయి
ముంబయి, మే15(జ‌నం సాక్షి ) : అప్పుడే రెక్కలొచ్చిన పక్షి అమాతం పైకెగిరి.. దబాల్న కిందపడుతుంది..’ మంగళవారం స్టాక్‌మార్కెట్లకు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు కూడా అదేస్థాయిలో కదలాడాయి. భాజపా ఆధిక్యంతో తొలిగంటల్లో అమాంతం ఎగబాకిన సూచీలు.. ఆతర్వాత క్రమంగా పడుతూ వచ్చాయి. చివరకు ఆరంభ లాభాలన్నీఆవిరై.. స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం10గంటలకు మంగళవారం మార్కెట్‌ ఆద్యంతం మదుపర్లు కర్ణాటక ఫలితాలపైనే దృష్టిపెట్టారు. అందుకు అనుగుణంగానే ట్రేడింగ్‌ సాగింది. ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే భాజపా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో సూచీలు జోరందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ జోరు ఎంతోసేపు నిలవలేదు. మదుపర్ల లాభాల స్వీకరణతో మధ్యాహ్నం సమయంలో సూచీలు ఆరంభ లాభాల్లో కొంత కోల్పోయాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభాన్ని కోల్పోయింది. నిఫ్టీ కూడా స్వల్ప లాభంతో కదలాడింది. ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు మరింత రసకందాయంగా మారాయి. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోయింది. దీంతో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఈ చర్చల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఈ నేపథ్యంలో ఆరంభ లాభాలను పూర్తిగా కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో నేటి సెషన్లో సూచీలు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 13 పాయింట్లు కోల్పోయి 35,544 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 10,802 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో టాటాస్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడగా.. టాటామోటార్స్‌, ఎస్‌బీఐ, కోల్‌ఇండియా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.