మార్చ్‌ను వాయిదా వేసుకోండి
– తెలంగాణవాదులకు సీఎం, గవర్నర్ వినతి
న్యూఢిల్లీ / హైదరాబాద్ ,సెప్టెంబర్ 20 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్ నిర్వహణకు తెలంగాణవాదులు సన్నాహాలు పెద్ద ఎత్తున పెంచిన నేపథ్యంలో గవర్నర్, సీఎం ఈ వ్యవహారంపై వేర్వేరుగా స్పందించారు. ఇద్దరు మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. ఆజాద్‌తో సుమారు గంటపాటు చర్చ గవర్నర్ నరసింహన్ బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 29, 30న గణేశ్ నిమజ్జనం ఉన్నందున తెలంగాణవాదులు మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
చేశారు. మార్చ్ నిమజ్జనం ఒకేసారి జరిగితే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందునే ఈ ప్రకటన చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. మార్చ్ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, ఈ విషయంలో మంచే జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం తెలంగాణ మంత్రులతో భేటీ అయ్యారు. జూబ్లీ హాలులో జరిగిన ఈ సమావేశానికి 9 మంది టీ మంత్రులు హాజరయ్యారు. ఇక్కడ కూడా చర్చ కేవలం తెలంగాణ మార్చ్‌పైనే సాగింది. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకునేలా టీ మంత్రులు తెలంగాణవాదులను ఒప్పించాలని కోరారు. ఆయన కూడా గణేశ్ నిమజ్జనాన్నే కారణంగా చూపారు. ముఖ్యమంత్రి సూచనపై టీమంత్రులు తాము ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నేడు శాసనసభలో రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి కూడా చేస్తానని సీఎం తెలిపారు. ఒకవేళ ఇది సాధ్యం కాకుంటే ప్రత్యక్ష్యంగా మంత్రులు తెలంగాణవాదులను కలిసి వాయిదా విషయంపై ఒప్పించాలని సూచించారు. 29న మొదలయ్యే నిమజ్జనం 30 వరకు ట్యాంక్ బండ్‌పై కొనసాగుతుంది కాబట్టి ఆ రోజు మార్చ్‌కు అనుమతివ్వడంపై ఆలోచించాల్సి వస్తుందని సీఎం మంత్రులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం, గవర్నర్‌ల ప్రకటనలు మీడియాలో రావడంతో దీనిపై తెలంగాణవాదులు కూడా స్పందించారు. మార్చ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయమని, ఒకవేళ వాయిదా వేయాలంటే తెలంగాణ ఏర్పాటు వేరే మార్గం లేదని స్పష్టం చేశారు.