‘మార్చ్’పై మాట్లాడిన కేసీఆర్
తెలంగాణ మార్చ్
మరో దండి సత్యాగ్రహం
శాంతియుత నిరసనకు అనుమతించండి
కేసీఆర్ డిమాండ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : ఈ నెల 30న జరిగే మరో దండి సత్యాగ్రహమని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అభివర్ణించారు. మార్చ్ కచ్చితంగా గాంధేయ మార్గంలో, శాంతియుతంగా జరుగు తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టిం చడం మానుకొని కవాతుకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కావాలనే ప్రభుత్వం కవాతుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి రిపోర్టు రాకున్నా, మార్చ్‌లో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని కేసీఆర్ విమర్శిం చారు. మార్చ్‌కు ముందే తెలంగాణవాదులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నాలుగు కోట్ల మంది ఆకాంక్షను చాటేందుకు నిర్వహిస్తున్న తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకే ప్రభుత్వం తెలంగాణ వాదుల అరెస్టుకు తెగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అరెస్టులను ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పంథాలో ట్యాంక్ బండ్‌పై నిర్వహించ తలపెట్టిన సాగర హారం విజయవంతం అయ్యే తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 30న ప్రభుత్వం ఎన్ని బ్యారికేడ్లు ఏర్పాటు చేసినా, ప్రతి తెలంగాణ బిడ్డ వాటిని ఛేదించుకుని ట్యాంక్ బండ్‌కు చేరుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.