మార్పు కోసమే జనసేనలోకి యువత

– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
నెల్లూరు, మార్చి4(జ‌నంసాక్షి) :  మార్పు కోసమే యువత జనసేన పార్టీలోకి వచ్చారు.. వస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నెల్లూరు కేజీకే కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలు, కో ఆర్డినేటర్లతో సోమవారం పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరికొత్త తరం సరికొత్త రాజకీయ వ్యవస్థను కోరుకుంటోందన్నారు. విూ అందరిని కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికా వెళ్లి స్పీచ్‌ ఇవ్వడానికి ధైర్యం ఉంటుందని, కానీ సొంత ఊరు రావాలంటే నన్ను గుర్తుపడతారనే భయముందన్నారు. నెల్లూరు రాగానే నేను హీరోని కాదు? జనసేన నాయకుడిని కాదు? సాధారణ పవన్‌ కల్యాణ్‌ ని మాత్రమేనన్నారు. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య, రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలకు వెళ్తుంటే చాలా గొప్పగా అనిపించేదన్నారు. నేను ఇక్కడ ఫత్తేఖాన్‌ పేటలో ఉండేవాడినన్నారు. నేను రొట్టెల పండుగకు చదువుల రొట్టెలను వదిలేవాడినని.. కానీ చదువు రాలేదన్నారు. నాకు వచ్చిన చదువంతా మిమ్మల్ని చూసి నేర్చుకున్నదేనన్నారు. 2009లో కావాలనే పోటీ చేయలేదన్నారు. చేయాలనుకుంటే నెల్లూరు నుంచే పోటీ చేసేవాడినన్నారు. కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే పోటీ చేయలేదని పవన్‌ అన్నారు.