మావోయిస్టు పార్టీ ఒడిషా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచిపండా బహిష్కరణ

శత్రువుతో చేతులు కలిపి విప్లవ ద్రోహం చేశాడని పార్టీ ఆరోపణ
హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : సీపీఐ (మావోయిస్టు) ఒడిషా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచి పండాను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కేంద్ర కమిటీ నిర్ణయించిందని, ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మధ్య రీజనల్‌ బ్యూరో కార్యదర్శి ఆనంద్‌ శుక్రవారం మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. పాలకవర్గాలతో గొంతు కలిపి, వారికి సహకరిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పండా పాల్పడుతున్నాడని, అందుకే అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆనంద్‌ తన లేఖలో వివరించారు. కేంద్ర కమిటీ తరుపున తాను ఈ లేఖను విడుదల చేస్తున్నట్లు తెలిపిన ఆనంద్‌ పండా పార్టీపై విషపూరిత, నిరాధార, బూటకపు ఆరోపణలు చేసి, విప్లవ ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా సవ్యసాచి పండా గత నెల 14న మావోయిస్టు పార్టీని వ్యతిరేకిస్తూ, పార్టీ కార్యకలాపాలపై ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అందులో మావోయిస్టులు అమాయక ప్రజలను చంపుతున్నారని, నిరాయుధులైన పోలీసులను కారణం లేకుండానే మట్టుబెడ్తున్నారని, ఆదివాసీలను మావోయిస్టులే అధికంగా దోపిడీ చేస్తున్నారని, అత్యాచారాలు చేస్తున్నారని పలు తీవ్ర ఆరోపణలను పండా చేశారు. ఈ నేపథ్యంలో పండా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, పాలకుల చూపిన ప్రలోభాలకు లొంగి పండా వాళ్లతో చేతులు కలిపాడని ఆనంద్‌ తన తాజా లేఖలో పేర్కొన్నారు. అందుకే, విప్లవానికి ద్రోహం చేసిన పండాను బహిష్కరిస్తున్నట్లు తన లేఖలో వెల్లడించారు. శత్రువుతో చేతులు కలిపే వారెవరికైనా పార్టీలో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టు ఉద్యమం తెలుగు, కోయ వారి ఆధిపత్యంలో ఏకపక్షంగా సాగుతూ నియంతృత్వాన్ని పెంచుతున్నదని పండా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఆనంద్‌ లేఖలో కొట్టిపారేశారు. మావోయిస్టు ఉద్యమం ప్రజా ఉద్యమమని, ఎప్పటికప్పుడు తన విధి విధానాలను సమీక్షించుకుంటూ, నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే దిశగా సాగుతున్నదని ఆనందర్‌ స్పష్టం చేశారు. పండానే పాలకుల అండతో ఒడిషా రాష్ట్రంలో ఓ నియంతృత్వ వ్యవస్థను నడపాలని కుట్రలు చేస్తున్నాడని తమ విచారణలో తేలిందని వివరించారు. ఆదివాసీలను మోసం చేసే, ప్రజా వ్యతికరేక కార్యక్రమాలు చేపట్టే, పాలకులతో కలిసి విప్లవ ద్రోహానికి పాల్పడే వారికి మావోయిస్టు పార్టీలో ఎట్టి పరిస్థితిలో స్థానం ఇవ్వమని, ఈ సిద్ధాంతాలకు కట్టుబడి సంపూర్ణ విచారణ జరిపి, నిజాలు తెలుసుకున్నాకే సవ్యసాచి పండాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేస్తున్నామని ఆనంద్‌ తన లేఖలో స్పష్టం చేశారు. ఇక ముందు పండాకు పార్టీతో ఎటువంటి సంబంధాలు ఉండబోవని ఆయన వెల్లడించారు.