మా ఎమ్మెల్యేలను కొనడం ఈజీకాదు

– ట్విట్టర్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనడం అంతసులభం కాదని, మా పార్టీ నియమాలకు కట్టేబడేవారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ అన్నారు. గురువారం కేంద్రమంత్రి గోయల్‌ మాట్లాడుతూ.. 14మంది ఆమ్‌ ఆద్మీ ఎమ్మెల్యేలు తమ పార్టీ వీడి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే వీళ్లను కొనాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.10 కోట్లు ఆశచూపుతోందంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఢిల్లీలోని మొత్తం 7లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగేందుకు సరిగ్గా పది రోజుల ముందు బీజేపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించారు. తమ ఎమ్మెల్యేలను
కొనడం అంత సులభం కాదంటూ కౌంటర్‌ విసిరారు. మరి ఇంకెందుకు అక్కడే ఆగిపోయారు? విూరు ఎంత ఇస్తామన్నారు? వాళ్లు ఎంత అడుగుతున్నారు? అని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైనా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మోదీజీ… ప్రతిపక్ష పార్టీల పాలన కింద ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేస్తారా అంటూ ప్రశ్నించారు. విూ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని నిలదీశారు. మరి ఇంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి విూరు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యేలను కొనడానికి విూరు చాలాసార్లు ప్రయత్నించారని, ఆప్‌ నాయకులను కొనడం అంత సులభం కాదంటూ మరో ట్వీట్‌లో కేజీవ్రాల్‌ దుయ్యబట్టారు.