మా లో సద్దుమణిగిన వివాదం
ఇకముందు అన్నీ కలసి నిర్ణయిస్తామన్న తమ్మారెడ్డి
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాలో చెలరేగిన వివాదం టీకప్పులో తుఫాన్‌లా సద్దుమణిగింది. నరేశ్ లేవనెత్తిని అంశాలపై లోపాయకారిగా చర్చలు సాగాయని సమాచారం. పరువు బయటపడేసుకోవడం తగదని సినీ పెద్దలు నిర్ణయించారని తెలుస్తోంది. మా కు సంబంధించిన నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వివిధ కార్యక్రమాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందం ప్రకారమే అన్నీ జరిగాయని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇటీవల ‘మా’లో చెలరేగిన వివాదం గురించి నిర్మాత సురేష్‌బాబు, మా అధ్యక్ష, కార్యదర్శులు శివాజీరాజా, నరేష్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండస్ట్రీలో అందరం స్నేహితుల్లాగానే ఉన్నాం. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉంటాం. చాలాసార్లు తిట్టుకొని, కొట్టుకొని ఉండవచ్చు. తెలుగు ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ అనేదానిని పెట్టుకుని సమస్యలు పరిష్కరించాలని అనుకొన్నాం. కానీ, ఇటీవల ఓ చిన్న వివాదం జరిగింది. అది జరిగి ఉండాల్సింది కాదని విరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు సంబంధించిన నిధులు కరెక్ట్‌గానే ఉన్నాయి. సమస్య ఏవిూ లేదు. చేసుకున్న ఒప్పందాల ప్రకారం డబ్బులు వచ్చాయి. భవిష్యత్‌లో సినిమా పరిశ్రమకు సంబంధించి ఏ విషయంలోనైనా సమస్య వస్తే, కలెక్టివ్ కమిటీ పరిష్కరిస్తుంది. దయచేసి విూడియా కూడా కలెక్టివ్ కమిటీని సంప్రదించి వార్తలు రాస్తే బాగుంటుందన్నారు. విూ సహకారం లేకుండా మేము ఏదీ చేయలేం. ఇక నుంచి ఏ సమస్య విూదైనా మేమే మాట్లాడతాం. ఇటీవల ‘మా’లో చెలరేగిన వివాదం విషయంలో అనుకోకుండా ప్రెస్‌విూట్‌లు పెట్టారు. ఇక నుంచి అలా జరగదు. భవిష్యత్‌లో ఎవరికి వారు సొంతంగా ప్రెస్ ఎదుటకు వచ్చి మాట్లాడరని అన్నారు. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిల్మ్ కౌన్సిల్ ఇలా అనేక విభాగాలు కలిసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై మాట్లాడేందుకు తెలుగు ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీని ఏర్పాటు చేశాం. సమస్య ఏదైనా ఇక నుంచి కలెక్టివ్ బాడీనే మాట్లాడుతుంది. ‘మా’కు సంబంధించిన డబ్బుల విషయంలో ఇటీవల చెలరేగిన వివాదాలు కూడా సద్దుమణిగాయి. నిధులన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ‘మా’కు ఎలాంటి నష్టం కలగలేదని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమ గ్లామర్‌కు, పబ్లిక్‌కు డైరెక్ట్‌గా కనెక్ట్ అయింది. ఇందులో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటాం. నలుగురు మనుషులు కలిసి పనిచేసే ఒక సంస్థలో భేదాభిప్రాయలు రావడం సహజం. ఈ నేపథ్యంలో కలెక్టివ్ కమిటీని ఏర్పాటు చేసి, వాళ్లకు అన్నీ
వివరించి, సమస్య పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాం. రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీని విజయవంతం చేయడం మా ప్రధాన కర్తవ్యం. విదేశీ పర్యటనలు కూడా స్పష్టంగా ఉంటాయి అని ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ అన్నారు. మా అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ.. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అవన్నీ సర్దుకున్నాయని అన్నారు.